కలం, వెబ్ డెస్క్: రాయ్‌పూర్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో కేకేఆర్ బ్యాటర్లు రఘువంశీ, రింకూ సింగ్ చెలరేగారు. రఘువంశీ రఫ్ఫాడిస్తే.. ఐదో ప్లేస్‌లో వచ్చిన రింకూ సింగ్ తాను ఏమాత్రం కాదన్న రీతిలో అదరగొట్టాడు. బెంగళూరు బౌలర్లను నలుమూలలా బాదుతూ కేకేఆర్ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. నిర్ణీత 20 ఓవర్లలో కోల్‌కతా 4 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. ఫలితంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించాలంటే 193 పరుగులు చేయాల్సి ఉంది.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతాకు ఓపెనర్లు అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. అజింక్య రహానే 13 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సర్‌తో 19 పరుగులు చేయగా, ఫిన్ అలెన్ కేవలం 8 బంతుల్లోనే 3 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 18 పరుగులు పిండుకున్నాడు. అయితే రహానేను హేజిల్‌వుడ్, అలెన్‌ను భువనేశ్వర్ కుమార్ పెవిలియన్ పంపడంతో కేకేఆర్ 48 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన రఘువంశీ ఇన్నింగ్స్ బాధ్యతను భుజానికెత్తుకుని మైదానం నలుమూలలా బౌండరీల వర్షం కురిపించాడు.
మధ్య ఓవర్లలో రఘువంశీకి తోడుగా కామెరాన్ గ్రీన్ నిలకడగా ఆడాడు. గ్రీన్ 24 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 32 పరుగులు చేసి రసిఖ్ సలాం బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. మరోవైపు రఘువంశీ 46 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 71 పరుగులు చేసి రనౌట్‌గా వెనుదిరిగాడు. చివర్లో రింకూ సింగ్ తన మార్క్ హిట్టింగ్‌తో ఆర్‌సీబీ బౌలర్లను వణికించాడు. కేవలం 29 బంతులు ఎదుర్కొన్న రింకూ 3 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 49 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. దీంతో కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసి, బెంగళూరు ముందు 193 పరుగుల కఠినమైన లక్ష్యాన్ని ఉంచింది.
ఆర్‌సీబీ బౌలింగ్ విషయానికి వస్తే బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకున్నారు. జాకబ్ డఫ్ఫీ 4 ఓవర్లలో వికెట్లేమీ తీయకుండానే 48 పరుగులు ఇచ్చి అత్యంత ఖరీదైన బౌలర్‌గా నిలిచాడు. భువనేశ్వర్ కుమార్ 3.6 ఓవర్లలో 34 పరుగులిచ్చి ఒక వికెట్ తీయగా, జోష్ హేజిల్‌వుడ్ (1/35), రసిఖ్ సలాం (1/35) చెరో వికెట్ పడగొట్టారు. క్రునాల్ పాండ్యా తన 4 ఓవర్ల కోటాలో 39 పరుగులు ఇచ్చాడు. రఘువంశీ, రింకూ సింగ్ అద్భుత ఫామ్‌లో ఉండటంతో కేకేఆర్ గౌరవప్రదమైన స్కోరును సాధించగలిగింది. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలిస్తున్న వేళ ఆర్‌సీబీ ఈ లక్ష్యాన్ని ఎలా ఛేదిస్తుందో చూడాలి.

