పీవీ సింధు వరల్డ్ టూర్ ఫైనల్స్‌కు అర్హత!

క‌లం, స్పోర్ట్స్: భారత షట్లర్ పీవీ సింధు (PV Sindhu) సీజన్ ముగింపు బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్ టోర్నమెంట్‌కు అర్హత సాధించారు. చైనాలోని హాంగ్‌జౌలో డిసెంబరు 9 నుంచి 13 వరకు ఈ పోటీలు జరగనున్నాయి. ఈ ప్రతిష్టాత్మక టోర్నీకి ఇప్పటివరకు అర్హత సాధించిన ఐదుగురు క్రీడాకారుల్లో సింధు ఒకరు. 2021 తర్వాత ఆమె మొదటిసారిగా ఈ టోర్నమెంట్‌లో అడుగుపెడుతున్నారు. దక్షిణ కొరియాకు చెందిన అన్ సే-యంగ్, జపాన్ ప్లేయర్ అకానే యామాగుచి, చైనాకు చెందిన వాంగ్ జీ యి, చెన్ యు ఫెయ్‌లతో పాటు సింధు బెర్త్ ఖరారు చేసుకున్నారు.

మొత్తం ఎనిమిది స్థానాలకు గాను మిగిలిన మూడింటి కోసం పోటీ కొనసాగుతోంది. తొమోకా మియాజాకి, నోజోమి ఒకుహారా, రట్చానోక్ ఇంటానన్, పోర్న్‌పావీ చోచువాంగ్, పుత్రి కుసుమ వర్దాని, లైన్ క్రిస్టోఫర్సేన్ ఈ రేసులో ఉన్నారు.సింధు ఈ సీజన్‌లో రెండు టైటిళ్లు గెలిచి, ఒకసారి రన్నరప్‌గా నిలిచారు. జులై 19న జపాన్ ఓపెన్ ఫైనల్లో అకానే యామాగుచిని ఓడించి తొలి టైటిల్ సాధించారు. ఆ తర్వాత అక్టోబరులో ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ వరకు వెళ్లినా, అన్ సే-యంగ్ చేతిలో ఓటమి పాలయ్యారు.

ఆ వెంటనే కోలుకున్న సింధు, జర్మనీలోని సారబ్రుకెన్‌లో జరిగిన హైలో ఓపెన్‌లో ఛాంపియన్‌గా నిలిచారు. అక్టోబరు 27 నుంచి నవంబరు 1 వరకు జరిగిన ఈ పోటీల్లో రెండో సీడ్‌గా బరిలోకి దిగిన సింధు, ఒక్క గేమ్‌ కూడా కోల్పోకుండా ఐదు మ్యాచ్‌లు గెలిచారు. సెమీఫైనల్లో అన్మోల్ ఖర్బ్‌పై, ఫైనల్లో డెన్మార్క్ షట్లర్ లైన్ జార్స్‌ఫెల్ట్‌పై విజయం సాధించి ఏడాదినో రెండో టైటిల్ కొట్టారు.ఈ సూపర్ 500 విజయం ద్వారా సింధుకు 9,200 ర్యాంకింగ్ పాయింట్లు వచ్చాయి.

బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ఆమె ప్రస్తుతం 74,421 పాయింట్లతో ఆరో స్థానంలో ఉన్నారు. అయితే, వరల్డ్ టూర్ రేసులో 81,060 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచారు. వరల్డ్ టూర్ ర్యాంకింగ్స్ ఆధారంగానే టాప్-8 క్రీడాకారులకు ఈ ఫైనల్స్‌లో అవకాశం దక్కుతుంది. 2022లో అర్హత సాధించినప్పటికీ కాలికాలి గాయం కారణంగా సింధు ఆడలేకపోయారు. గతంలో 2018లో జరిగిన ప్రారంభ బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో నోజోమి ఒకుహారాను ఓడించి టైటిల్ గెలుచుకున్నారు. అలాగే 2017, 2021 లలో రన్నరప్‌గా నిలిచారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>