కలం, కరీంనగర్: తమ తల్లిదండ్రులు సత్తమ్మ – అంజయ్యల జ్ణాపకార్థం రూ.3.5 లక్షల విలువైన ఉపకరణాలకు అందజేసేందుకు ముందుకు వచ్చిన కరీంనగర్ ఆర్కే ఆగ్రోస్ అధినేత మియాపురం నాగరాజు, రామకృష్ణలను (Miyapuram Brothers) మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అభినందించారు. తల్లిదండ్రుల పేరిట సమాజానికి ఉపయోగపడే సేవాకార్యక్రమాలు నిర్వహించడం ప్రశంసనీయమని ఆయన అన్నారు. బుధవారం నాడు నాగరాజు సోదరులు మంత్రి నివాసంలో ఆయనను కలిసి తమ సేవా కార్యక్రమాల గురించి వివరించారు.
కరీంనగర్ జిల్లా కొండయ్య పల్లి గ్రామపంచాయతీకి రూ.1.5 లక్షల విలువైన పారిశుద్ధ్య పరికరాలను అందజేస్తున్నట్టు వారు తెలిపారు. మంథని నియోజకవర్గం ముత్తారం కస్తూర్బా బాలికల వసతి గృహానికి రూ.2 లక్షల విలువైన ఆటోమేటిక్ చపాతీల తయారీ యంత్రాన్ని బహుకరించనున్నట్టు వెల్లడించారు. ఈ యంత్రం ద్వారా గంటకు 500 చపాతీలను తయారు చేయవచ్చు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ స్టేట్ అసిస్టెంట్ డైరెక్టర్ బర్ల రాజు, అడవి శ్రీరాంపూర్ ఉప సర్పంచ్ అనవేన హరిత తిరుపతిలు పాల్గొన్నారు.

