కలం, వెబ్ డెస్క్: ఆస్ట్రేలియన్ బ్యాడ్మింటన్ ఓపెన్‌లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు (PV Sindhu)కు భారీ షాక్ తగిలింది. ఫైనల్‌కు ఒక్క అడుగు దూరంలో నిలిచిన ఆమె సెమీ ఫైనల్లోనే పోరాటాన్ని ముగించింది. ప్రపంచ ఛాంపియన్ అకానే యమగుచి చేతిలో సింధు 22-20, 21-12 తేడాతో ఓడిపోయింది. 43 నిమిషాల పాటు సాగిన మ్యాచ్‌లో తొలి గేమ్ మాత్రం ఉత్కంఠభరితంగా సాగింది. మ్యాచ్ ఆరంభంలో సింధు దూకుడుగా ఆడింది. ఆధిక్యంలో కూడా నిలిచింది. కానీ యమగుచి వరుసగా ఆరు పాయింట్లు సాధించి మ్యాచ్‌ను తనవైపు తిప్పుకుంది.
అయినప్పటికీ సింధు గట్టిగా పోరాడి స్కోరును సమం చేసింది. అయితే కీలక సమయంలో జపాన్ స్టార్ పైచేయి సాధించింది. తొలి గేమ్ కోల్పోయిన సింధు రెండో గేమ్‌లో పుంజుకోలేకపోయింది. యమగుచి వరుసగా ఏడు పాయింట్లు సాధించి పూర్తి ఆధిపత్యం చెలాయించింది. దీంతో సింధు పోరాటం అక్కడితో ముగిసింది. 2026 సీజన్‌లో సింధు ఫైనల్ చేరాలన్న ఆశ మరోసారి నెరవేరలేదు. ఈ ఏడాది మలేషియా ఓపెన్ తర్వాత ఆమెకు ఇది రెండో సెమీఫైనల్ మాత్రమే.
ఇదిలా ఉండగా, భారత బ్యాడ్మింటన్ జట్టుకు కూడా టోర్నీ ముగిసింది. పురుషుల డబుల్స్‌లో ఎంఆర్ అర్జున్-హరిహరన్ జోడీ క్వార్టర్ ఫైనల్లోనే నిష్క్రమించింది. పురుషుల సింగిల్స్ ఆటగాళ్లు తొలి రౌండ్‌ను దాటలేకపోయారు. ఇప్పుడు భారత షట్లర్ల దృష్టి వచ్చే వారం ప్రారంభమయ్యే మకావు ఓపెన్ సూపర్-300 టోర్నీపై పడింది.

