కలం, నల్లగొండ: కాంగ్రెస్ హయాంలో అభివృద్ధి శూన్యమని, హ్యాం రోడ్ల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) చేస్తున్న హంగామా అంతా కేవలం కమీషన్ల కోసమేనని మాజీమంత్రి జగదీష్ రెడ్డి (Jagadish Reddy) తెలిపారు. నల్లగొండ పట్టణంలో శనివారం నిర్వహించిన బీఆర్ఎస్ నియోజకవర్గస్థాయి కార్యకర్తల విస్తృత సమావేశంలో పాల్గొని మాట్లాడారు. నల్లగొండ జిల్లాకు ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా కొత్తగా కేటాయించలేదన్నారు. జిల్లా నుండి ఇద్దరు మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్నా అభివృద్ధి ఎక్కడో వేసిన గొంగళిలానే ఉందని తెలిపారు. వారు తమ పదవులను కాపాడుకోవడానికే సభలు, హడావుడి చేస్తున్నారు తప్ప ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించారని ఎద్దేవా చేశారు. కోతల వెంకట్ రెడ్డి పెద్ద పెద్ద మాటలు చెబుతూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.
ఈ నెల 17న సీఎం రేవంత్ రెడ్డి నల్గొండ పర్యటన వెనుక భారీ స్కామ్ దాగి ఉందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే నల్లగొండ జిల్లా ఊహించని రీతిలో అభివృద్ధి చెందిందని జగదీష్ రెడ్డి గుర్తుచేశారు. కేసీఆర్ నాయకత్వంలోనే నల్లగొండకు మెడికల్ కాలేజీలు, మిషన్ భగీరథ నీళ్లు వచ్చాయని, దాదాపు రూ.1300 కోట్లతో పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దామని పేర్కొన్నారు. కానీ, ప్రస్తుత మంత్రులు అభివృద్ధిని గాలికొదిలేసి కేవలం స్కామ్‌లపైనే దృష్టి పెట్టారని మండిపడ్డారు. ఇదే సమయంలో పార్టీ బలోపేతానికి, రాబోయే కార్యక్రమాలకు సంబంధించి కార్యకర్తలకు ఆయన దిశానిర్దేశం చేశారు. ప్రత్యేక ఓటరు జాబితా పరిశీలన (ఎస్‌ఐఆర్), పార్టీ డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమాలను వేగవంతం చేయాలని పిలుపునిచ్చారు.
గ్రామాల్లోని బీఆర్ఎస్ బూత్ ఏజెంట్లు ప్రతిరోజూ బీఎల్ఓలతో కలిసి ఇంటింటికీ తిరిగి ఓటరు జాబితాను నిశితంగా పరిశీలించాలని సూచించారు. ఓటర్ల వివరాల్లో ఎలాంటి తప్పులు లేదా అనుమానాలు కనిపించినా, ఎక్కడా గొడవలకు దిగకుండా వెంటనే ఆర్డీవోకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయాలని పేర్కొన్నారు. ఈ విస్తృత స్థాయి సమావేశంలో ఎమ్మెల్సీ మంకెన కోటిరెడ్డి, నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్, మాజీ జడ్పీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డితో పాటు నియోజకవర్గ పరిధిలోని ముఖ్య నాయకులు, భారీ సంఖ్యలో గులాబీ శ్రేణులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

