ఖరీఫ్ ధాన్యం సేకరణపై కలెక్టర్ కీలక ఆదేశాలు

కలం, నిజామాబాద్ బ్యూరో: ఖరీఫ్ 2026-27 సీజన్‌లో ధాన్యం సేకరణ (Kharif Paddy Procurement), సేకరించిన ధాన్యాన్ని సురక్షితంగా నిల్వ చేసేందుకు పకడ్బందీ ప్రణాళికతో ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ (Nizamabad Collector) భవేష్ మిశ్రా అధికారులను ఆదేశించారు. బుధవారం నిజామాబాద్ కలెక్టరేట్‌లో సంబంధిత శాఖల అధికారులు, తహసీల్దార్లతో ఖరీఫ్ ధాన్యం సేకరణపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ఈ ఖరీఫ్ సీజన్‌లో 4.35 లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారని, సుమారు 12 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. ఇందులో 6.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు వెల్లడించారు.

రైతులకు అందుబాటులో ఉండేలా జిల్లావ్యాప్తంగా 736 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. గత రబీ సీజన్‌లో 660 కేంద్రాలు కొనసాగగా, ఈసారి అదనంగా 76 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలోనే ముందుగా నిజామాబాద్ జిల్లాలో ధాన్యం దిగుబడులు చేతికి వచ్చే అవకాశం ఉన్నందున అక్టోబర్ మొదటి వారం నుంచే కొనుగోలు కేంద్రాలను అందుబాటులోకి తీసుకురావాలని చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. ప్రతి కొనుగోలు కేంద్రంలో రైతులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. గన్నీ బస్తాలు, తేమ కొలిచే యంత్రాలు, వేయింగ్ మెషీన్లు, టార్ఫాలిన్లు సరిపడా ముందుగానే అందుబాటులో ఉంచాలని సూచించారు. అవసరమైన సదుపాయాలు సమకూర్చి, ఆన్‌లైన్‌లో వివరాలను అప్‌లోడ్ చేసిన తర్వాతే ట్యాబ్ అందుబాటులోకి వస్తుందని స్పష్టం చేశారు.

ధాన్యం నిల్వకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు

కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించిన ధాన్యాన్ని ఈసారి రైస్ మిల్లులకు పంపే అవకాశం లేనందున, ధాన్యాన్ని సురక్షితంగా నిల్వ చేసేందుకు అవసరమైన గిడ్డంగులు, అనువైన స్థలాలను ముందుగానే గుర్తించాలని కలెక్టర్ ఆదేశించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ గిడ్డంగులతో పాటు మార్కెట్ కమిటీ గోడౌన్లు, ప్రైవేట్ గిడ్డంగులను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని సూచించారు. అవసరమైన సందర్భంలో మూతపడిన రైస్ మిల్లులు, పరిశ్రమలు, ఫంక్షన్ హాళ్లు, ఖాళీ స్థలాలను కూడా ధాన్యం నిల్వకు అనువుగా గుర్తించాలని తహసీల్దార్లకు సూచించారు.

ఎక్కడా ధాన్యం నిల్వ విషయంలో ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపట్టాలని అన్నారు. సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ధాన్యం సేకరణ ప్రక్రియ సజావుగా జరిగేలా చిత్తశుద్ధితో కృషి చేయాలని కలెక్టర్ భవేష్ మిశ్రా సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ భుజంగరావు, ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియ, డీఆర్ఓ గీత, ఆర్డీఓలు రాజేంద్ర కుమార్, విజయ కుమారి, డీఎస్ఓ శ్రీకాంత్ రెడ్డి, సివిల్ సప్లైస్ డీఎం ప్రవీణ్, డీసీఓ శ్రీనివాస్ రావుతో పాటు సంబంధిత శాఖల అధికారులు, అన్ని మండలాల తహసీల్దార్లు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>