కలం, జోగులాంబ గద్వాల: వ్యవసాయ శాఖ సూచనల అనుసరించి ఆరు తడి పంటల సాగు చేపడితే తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయం పొందవచ్చని జోగులాంబ గద్వాల (Jogulamba Gadwal) జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సూచించారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేక చొరవతో నిర్వహిస్తున్న ‘రైతు నేస్తం’ 100వ ఎపిసోడ్ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. గద్వాల మండలం చెనుగొనిపల్లి రైతు వేదికలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులకు అందించిన శాస్త్రీయ వ్యవసాయ సూచనలను వీక్షించారు.
ఈసారి సాధారణం కంటే వర్షపాతం..
ఈ సందర్భంగా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ మాట్లాడుతూ.. ఎల్‌నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని రైతులు శాస్త్రీయ విధానాలను అనుసరించాలని సూచించారు. ఇటీవల కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసినా, మొత్తం వర్షాకాల పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం అవసరమన్నారు. వాతావరణ శాఖ సమాచారం ప్రకారం ఈ ఏడాది సాధారణం కంటే వర్షపాతం తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే జిల్లాలో వర్షపాతం గణనీయంగా తగ్గిందని పేర్కొన్నారు.
దశల వారీగా నీటి నిల్వల వినియోగం..
ప్రస్తుతం ప్రాజెక్టుల్లో నీటి నిల్వలను తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని దశలవారీగా వినియోగిస్తున్నామని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. సాగునీటి విడుదలపై కూడా పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. ఆయిల్ పామ్‌తో పాటు పంటల వైవిధ్యీకరణకు కృషి చేసిన వ్యవసాయ అధికారులను కలెక్టర్ సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వీరప్ప, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి రాజ్ కుమార్, గద్వాల్ తహసీల్దార్ హరికృష్ణ, చెనుగొనిపల్లి సర్పంచి పద్మ, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

