epaper
Sunday, March 1, 2026
epaper

ఓ కుటుంబానికి ఏటీఎంలా పుదుచ్చేరి : పీఎం మోదీ

కలం, వెబ్​ డెస్క్​: ప్రజలందరికీ ఆరోగ్య సేవలు చౌకగా, సులభంగా, అత్యుత్తమంగా అందాలని.. వీటిని ఆయుష్మాన్​ భారత్​ తీరుస్తోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) అన్నారు. ఈ పథకం ఇప్పటికే దేశవ్యాప్తంగా కోట్లాది కుటుంబాల ఆరోగ్య సేవకు ఉపయోగపడుతోందని చెప్పారు. తమిళనాడు, పుదుచ్చేరి పర్యటనల్లో భాగంగా ఆదివారం ఆయన కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో పర్యటించారు. రూ.2,700కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు.

అనంతరం జరిగిన సభలో మాట్లాడారు. స్వాతంత్య్రోద్యమ కాలంలో పుదుచ్చేరి పోషించిన పాత్రను ప్రశంసించారు. గత పర్యటనలో తాను చెప్పిన ‘బెస్ట్​ పుదుచ్చేరి’ నినాదాన్ని సాకారం చేసే దిశగా జరుగుతున్న అభివృద్ధిని గుర్తుచేశారు. రాష్ట్రాలకు మాత్రమే వర్తించే ప్రత్యేక మూలధన పెట్టుబడి సహాయ పథకంలో పుదుచ్చేరిని కూడా కేంద్ర ప్రభుత్వం చేర్చిందని ప్రధాని వెల్లడించారు. ఈ నిర్ణయం వల్ల మరింత మెరుగైన మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధి ప్రయోజనాలు కలుగుతాయని అన్నారు.

ఓ కుటుంబానికి ఏటీఎం..

పుదుచ్చేరిని ఢిల్లీలోని ఓ కుటుంబానికి ఏటీఎంలా కాంగ్రెస్​–డీఎంకే ప్రభుత్వం వాడుకుందని విమర్శించారు. వాళ్ల పాలనలో రాజకీయ అస్థిరత, అవినీతి, నేరాలు రాజ్యమేలాయన్నారు. పేదలు తీవ్ర అవస్థలకు గురయ్యారని చెప్పారు. రేషన్​ దుకాణాల్లో రైస్​ ఉండేది కాదని, జీతాలు ఆలస్యమయ్యేవని, గూండాలు, డ్రగ్స్​ మాఫియాలు వీధుల్లో విచ్చలవిడిగా చెలరేగేవని మండిపడ్డారు. ఎన్​డీఏ కూటమి పుదుచ్చేరి సంస్కృతి, వారసత్వాలను గౌరవిస్తూనే అభివృద్ధి పథంలో నడిపిస్తోందని చెప్పారు.

అనంతరం, ఆయన తమిళనాడులోని మధురైలో జరిగిన సభలో పాల్గొన్నారు. అంతకుముందు రూ.4,400కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాప చేశారు. తమిళనాడు అభివృద్ధి దేశాభివృద్ధికి కీలకం అన్నారు. 2027 నాటికి వికసిత్​ భారత్​ నిర్మాణం సాకారం కావాలనే గొప్ప సంకల్పంలో తమిళనాడు కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు.

ఎన్​డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తమిళనాడు అభివృద్ధికి ఎన్నో నిధులు, ప్రాజెక్టులు కేటాయించిందని ప్రధాని గుర్తుచేశారు. కేంద్రం తమిళనాడుకు బడ్జెట్​లో కేటాయింపులు తక్కువగా ఇస్తోందని డీఎంకే చేస్తున్న ఆరోపణలపై స్పందిస్తూ.. యూపీఏ హయాంలో కంటే మూడు రెట్ల ఎక్కువ నిధులను తమిళనాడుకు ఎన్​డీఏ ప్రభుత్వం కేటాయించిందని చెప్పారు. డీఎంకే పాలనలో తమిళనాడులో అనేక స్కామ్​లు జరిగాయని పీఎం ఆరోపించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!