కలం మెదక్ బ్యూరో: సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు (Patancheru) నియోజకవర్గ నాయకులకు ‘సర్’ దెబ్బ గట్టిగా తగలనుందా..? డిజిటలైజేషన్ ప్రక్రియకు పట్టణ ఓటర్లు ఆసక్తి చూపకపోవడంతో దాదాపు లక్షన్నర ఓట్లు కోల్పోయే ప్రమాదం ఉందా? అంటే ఔననే సమాధానం వినిపిస్తోంది. సాధారణ ఎన్నికల తరహలో కాంగ్రెస్, బీఅర్ఎస్ పార్టీలు పోటీపడి మరి SIR విజయవంతం కోసం ప్రణాళికలు రూపొందించాయి. కానీ.. క్షేత్రస్థాయిలో ప్రచారం చేస్తున్నా ఆశించినస్థాయిలో ఓటర్లు ముందుకు రావడంలేదు. ఎస్ఐఆర్ కారణంగా పటాన్‌చెరు నియోజకవర్గంలో జరగబోయే రాజకీయ మార్పులపై ప్రధాన పార్టీల నేతల్లో అందోళన మొదలైంది.
అతిపెద్ద పారిశ్రామిక ప్రాంతంగా..
పటాన్‌చెరు అతిపెద్ద పారిశ్రామిక ప్రాంతంగా పేరుంది. దేశంలోనే ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇక్కడి ఓటర్ల సరళి ఇతర నియోజకవర్గాల కంటే భిన్నంగా ఉంటుంది. నియోజకవర్గంలో పలు ఫార్మా, మాన్యుఫ్యాక్చరింగ్ రంగాల కారణంగా బిహార్, యూపీ, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ లాంటి ఉత్తర భారత్ నుంచి లక్షలాది మంది కార్మికులు ఇక్కడ స్థిరపడ్డారు. భవన నిర్మాణ రంగంలో వేలాది కార్మికులు ఉపాధి పొందుతున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ చెందిన వేలాది మంది సైతం ఇక్కడ సెటిలయ్యారు. పటాన్‌చెరులో గెలుపోటములను శాసించేవారిలో ఇతర రాష్ట్రాలకు చెందినవారే కావడం గమనార్హం. అయితే ఇతర రాష్ట్రాల కుటుంబాలు స్థానికంగా ఓటు హక్కును కలిగి ఉండటంతోపాటు, తమ సొంత రాష్ట్రంలో సైతం ఓటు హక్కును కలిగిఉన్నారు. అయితే ప్రసుత్తం స్థానికంగా అందుబాటులో లేని ఓటర్ల పేర్లు తొలగించబడతాయనే ఆందోళన పార్టీల్లో ఉంది. గత 20 ఏండ్లుగా పరిశ్రమల్లో పనిచేస్తున్న కుటుంబాలు ఓటుహక్కును ఇక్కడే నమోదు చేసుకున్నారు. SIRలో భాగంగా ఒకటే ఓటు ఉంచుకోవాల్సిన పరిస్థితి. దీంతో మెజార్టీ కార్మికులు సొంత రాష్ట్రాల్లోనే ఓటుహక్కును ఉంచుకునేందుకు అసక్తి చూపుతున్నారు. దీంతో పెద్దఎత్తున ఓట్ల తొలగింపు జరిగే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఈ కారణంగా తమ సాంప్రదాయ ఓటుబ్యాంకు దెబ్బతింటుందని పార్టీలు భావిస్తున్నాయి.
లక్షన్నర ఓట్లు గల్లంతు
ప్రధాన పార్టీల అందోళనకు తగట్టుగానే ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియ చెప్పుకోదగ్గ స్థాయిలో స్పందన కనిపించడం లేదు. ఎస్ఐఅర్ ప్రారంభమైన జూన్ 25 నుంచి నేటి వరకు 64.9 శాతం మాత్రమే పూర్తయ్యింది. పటాన్‌చెరు సెగ్మెంట్‌లో 4,28,682 ఓటర్లున్నా.. ఇప్పటివరకు 2,78,508 మంది వివరాలు డిజిటలైజ్‌తో 64.97 శాతం మాత్రమే ప్రక్రియ పూర్తైంది. అంటే ఇంకా దాదాపు లక్షన్నర మందికిపైగా డిజిటలైజేషన్ ప్రక్రియ నమోదుకు ముందుకురాలేదు. ముఖ్యంగా ఇతర రాష్ట్రాలవారు నివాసం ఉండే జీహెచ్ఎంసీ పరిధిలోని పటాన్‌చెరు, అమీన్ పూర్, ఆర్సీపురం మండలాల్లో ఎన్యూమరేషన్ తక్కువగా జరుగుతుంది. గ్రామీణ మండలాలైన జిన్నారం, గుమ్మడిదలలో ఎక్కువగా జరిగింది. ఈ నెల 10 వరకు సర్ గడుపు ఉన్నప్పటికీ.. క్షేత్రస్థాయి పరిస్థితులను చూస్తే మాత్రం ఓటర్లు ముందుకు వచ్చేది అనుమానంగానే కనిపిస్తోంది. సర్ ప్రక్రియ పట్టణ ఓటర్లు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. డిజిటలైజేషన్ కూడా స్లోగా సాగుతుండటంతో ప్రధాన పార్టీలకు అశలు సన్నగిల్లుతున్నాయి.
చివరి వరుసలోనే పటాన్‌చెరు
మరోవైపు సంగారెడ్డి జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో ఇప్పటి వరకు 78.09శాతం డిజిటలైజేషన్ పూర్తయింది. సంగారెడ్డి జిల్లాలోని మొత్తం 14,57,436 ఓటర్లకుగాను, ఇప్పటికే 11,38,177 మంది ఓటర్ల వివరాలను డిజిటలైజ్ చేశారు. సంగారెడ్డి జిల్లాలో డిజిటలైజేషన్ ప్రక్రియ అత్యధికంగా నారాయణఖేడ్(87.95) ఉంటే, ఆఖరున పటాన్‌చెరు నియోజకవర్గం (64.97) నిలిచింది.
SIR ప్రచార జోరు-స్పందన మాత్రం బేజారు
కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలకు BLAల బాధ్యతలు, ఓటర్ల సవరణ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించాయి. అయినా కుడా SIR ప్రక్రియ సవ్యంగా జరగకపొవడంతో కాంగ్రెస్, బీఅర్ఎస్ పార్టీలు క్షేత్రస్థాయిలో వరుస కార్యక్రమాలతో ముందుకెళ్తున్నాయి. ఇందులో భాగంగా పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిని తన ఫోటోతో ఉన్న SIR ప్రచార రథాలను సిద్ధం చేసి మరీ ప్రచారం చేస్తున్నారు. మరోవైపు నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జి కాట శ్రీనివాస్ గౌడ్ సైతం అవగహన కల్పిస్తున్నారు. SIR ప్రక్రియలో అధికారులు, ఓటర్లను సమన్వయంలో బిఎల్ఏ పాత్ర కీలకంగా ఉంటుంది. అయితే పట్టణ ప్రాంతంగా ఉన్న పటాన్‌చెరులో బీఎల్ఏ విధులు నిర్వహించడానికి ఎవరు దొరకని పరిస్థితి నెలకొంది.
ప్రధాన పార్టీలకు వణుకు
ప్రసుత్త పరిస్థితులను బట్టి చూస్తే పటాన్‌చెరు నియోజకవర్గంలో దాదాపు లక్షన్నర ఓట్లు గల్లంత్తయ్యే ప్రమాదం కనిపిస్తోంది. దీంతో రాబోయే స్థానిక, సార్వత్రిక ఎన్నికల్లో పైచేయి సాధించాలంటే ఈ ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను బలమైన పునాదిగా మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నియోజకవర్గ ముఖ్య నేతల నుంచి కిందిస్థాయి కార్యకర్త వరకు బీఅర్ఎస్, కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ సీరియస్‌గా తీసుకుంటున్నాయి. రెండుసార్లు గడువు పొడిగింపు నేపథ్యంలో తనకు పట్టున్న ప్రాంతాల్లో డిజిటలైజేషన్ పూర్తి చేసేలా పనిచేస్తున్నారు. ఓటర్లు లక్షల్లో తగ్గితే తమ ఎన్నికల ప్రణాళికలు బెడిసికొట్టడంపాటు, ఓటు బ్యాంక్ కుప్పకూలే ప్రమాదం ఉంది. సర్‌ని నిర్లక్ష్యం చేస్తే కొన్ని వర్గాలకు సంబంధించిన ఓట్లు ఏకపక్షంగా మారి ఫలితాలు తలకిందులైయ్యే ప్రమాదం ఉందని నేతలు సైతం భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో విషయం సాధించాలంటే ముందుగా సర్ ప్రక్రియ ద్వారా బలాన్ని పెంచుకోకతప్పదు. దీంతో మిగతా కార్యక్రమాలను పక్కనపెట్టి, SIR ప్రక్రియ చుట్టూ పటాన్‌చెరు నాయకులు ప్రత్యేక వ్యూహలతో కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

