Mobile Popup Ad
Mobile Popup Ad

ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా.. పలువురికి గాయాలు

కలం, ఖమ్మం బ్యూరో: ఏలూరు నుంచి హైదరాబాద్ వస్తున్న కేవీఆర్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఖమ్మం జిల్లాలో అర్ధరాత్రి బోల్తా కొట్టింది. పెనుబల్లి మండలంలో కొత్తలంకపల్లి రైల్వే బ్రిడ్జిని ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు ప్రయాణికులకు తీవ్ర గాయాలు కాగా, మరో ముగ్గురికి స్వల్పంగా గాయాలైనట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఏలూరు జిల్లా ముసునూరు మండలం చక్కపల్లి, నూజివీడు ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు 36 మంది ప్రయాణికులతో కేవీఆర్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బయలుదేరింది. మితిమీరిన వేగం కారణంగా డ్రైవర్ నియంత్రణ కోల్పోయి.. డివైడర్‌ను బలంగా ఢీకొట్టడంతో ఒక్కసారిగా పల్టీ కొట్టింది.

వెంటనే స్పందించిన గ్రామస్థులు..

అర్ధరాత్రి వేళ ​ప్రమాదం జరిగిన సమయంలో పెద్ద శబ్దం రావడంతో గ్రామస్థులు ఉలిక్కిపడ్డారు. వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. బస్సు అద్దాలు పగులగొట్టి, లోపల చిక్కుకుపోయి ఆర్తనాదాలు చేస్తున్న ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీశారు. వారికి ప్రాథమిక చికిత్స అందించారు. సమాచారం అందుకున్న వీఎం బంజర ఎస్సై వెంకటేష్, పోలీసులు అక్కడకు చేరుకుని క్షతగాత్రులను 108 అంబులెన్స్‌ల ద్వారా సత్తుపల్లి, పెనుబల్లి ప్రభుత్వాసుపత్రులకు తరలించారు. బస్సులోని మిగిలిన 24 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

వీరే క్షతగాత్రులు..​

ప్రమాదంలో మొత్తం 12 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో సత్తుపల్లికి చెందిన ఎం.శిరీష, ఎం.శివ గణేష్, పి.మల్లిక, చక్కపల్లికి చెందిన శ్రీనివాస్ రావ్, పావని, రాఘవపురానికి చెందిన సుష్మిత, యువన్, విజయరాయికి చెందిన ప్రణీత్, స్వప్న, బి.నరసింహ, లింగపాలెంకు చెందిన తాతిన బాలాజీ, కుంచపర్తికి చెందిన ఆర్.రామకృష్ణ ఉన్నారు. బస్సులో ధర్మాజిగూడెం, అక్కిరెడ్డిగూడెం తదితర ప్రాంతాలకు చెందిన వారు కూడా ఉన్నారు. ఎవరికీ ప్రాణాపాయం లేదని వైద్యులు స్పష్టం చేశారు.

గంట పాటు నిలిచిన ట్రాఫిక్..

​రైల్వే బ్రిడ్జిపై బస్సు రోడ్డుకు అడ్డంగా బోల్తా పడటంతో ఆ మార్గంలో ప్రయాణించే వాహనాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సుమారు గంట పాటు ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోయింది. పోలీసులు తీవ్రంగా శ్రమించి వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు. ​డ్రైవర్ అతివేగం, నిద్రమత్తు ఈ ప్రమాదానికి కారణమై ఉండవచ్చని రవాణా శాఖ అధికారులు ప్రాథమికంగా భావిస్తున్నారు. కేసు నమోదు చేసి పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>