ప్రైవేట్ ఆస్పత్రుల్లో దోపిడీ.. నల్లగొండ వైద్యారోగ్య శాఖ సవతిప్రేమ!

కలం, నల్లగొండ బ్యూరో: ప్రైవేట్ ఆస్పత్రులు (Nalgonda Private Hospitals), డయాగ్నోస్టిక్ సెంటర్లు కలిసి కుమ్మక్కు దందాకు పాల్పడుతున్నాయనే ఆరోపణలు కొన్నాళ్లుగా నల్లగొండ జిల్లా కేంద్రంలో వినిపిస్తున్నాయి. కార్పొరేట్ ఆస్పత్రుల మాదిరిగానే రూ. లక్షల్లో వైద్య చికిత్సకు ఫీజులు గుంజుతున్నారనే విమర్శలూ లేకపోలేదు. తాజాగా వెలుగుచూసిన కొన్ని ఘటనలు కలకలం రేపాయి. జిల్లా వైద్యారోగ్య శాఖ తీరు మాత్రం పలు అనుమానాలకు తావిస్తోంది. నల్లగొండలోని ఐకాన్ ఆస్పత్రిలో ఏకంగా 191 మంది రోగులు మృతి చెందడం సంచలనం సృష్టించడంతో సంబంధిత అధికారులు రంగంలోకి దిగారు.

ఆస్పత్రిలో ఆకస్మిక తనిఖీలు చేసి, కేస్ షీట్లను స్వాధీనం చేసుకుని విచారణ ప్రారంభించారు. ఒకే ఆస్పత్రిలో ఇన్ని మరణాలు జరగడం తీవ్రమైన విషయమే అయినప్పటికీ.. కేవలం ఒక్క ఆస్పత్రినే టార్గెట్ చేసుకుని దాడులు చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అక్రమాలు ఏ ఆస్పత్రిలో జరిగినా చర్యలు తీసుకోవాలి. కానీ మిగతా ఆస్పత్రులపై అధికారులు సవతి ప్రేమ చూపడం దేనికి? అని బాధిత కుటుంబాలు, ప్రజలు నిలదీస్తున్నారు. ప్రభుత్వ రూల్స్ జిల్లాలోని అన్ని ఆసుపత్రులకూ వర్తించాలి. కానీ కొన్నింటిని వదిలేసి కొన్నింటిపైనే చర్యలు చేపడితే అసలు దోపిడీకి అడ్డుకట్ట ఎలా పడుతుందని ప్రశ్నిస్తున్నారు.

“నల్లగొండ జిల్లా గుర్రంపోడు మండలానికి చెందిన కనకమహాలక్ష్మి డెలివరీ అయిన తర్వాత కడుపునొప్పితో బాధపడుతుండగా జిల్లాకేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లింది. డాక్టర్ ఆమెకు స్కానింగ్ రెఫర్ చేయగా.. ఓ డయాగ్నోస్టిక్ సెంటర్ కు వెళ్లి తీయించుకుంది. ఆమె మూత్రాశయంలో 10ఎంఎం సైజు రాయి ఉందంటూ రిపోర్ట్ ఇచ్చారు. వెంటనే రిపోర్టు తీసుకుని అదే ఆస్పత్రికి వెళ్లి చూపించుకోగా ఎమర్జెన్సీగా ఆపరేషన్ చేయాలని డాక్టర్లు చెప్పారు. ఆమె భయాందోళన చెంది హైదరాబాద్ లోని కార్పొరేట్ ఆస్పత్రి చూపించుకోగా.. అత్యాధునిక(CT-KUB Plain) స్కాన్ చేయగా ఎలాంటి రాయి లేదని తేలింది. అయితే.. ఆర్యోగశ్రీ, హెల్త్ ఇన్సూరెన్స్ క్లైమ్ కావాలంటే రాళ్ల సైజు 10ఎంఎం కంటే పెద్దగా ఉండాలనే నిబంధన ఉంది. దీన్ని సాకుగా చేసుకుని, లేని రాళ్లను ఉన్నట్లు రిపోర్టుల్లో సృష్టిస్తూ ప్రైవేట్ ఆస్పత్రులు, డయాగ్నోస్టిక్ సెంటర్లు కుమ్మక్కై దండుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తుండగా, వైద్యాధికారుల నిర్లక్ష్యానికి బాధితురాలి ఘటనే అద్దం పడుతోంది.”

ఫిర్యాదు చేసినా చర్యల్లేవ్..

జిల్లా కేంద్రంలో దాదాపు 180 గుర్తింపు పొందిన ప్రైవేట్ ఆస్పత్రులు ఉండగా, కొత్తగా మరో 150 దరఖాస్తు చేసుకున్నాయి. కేవలం ఒకే ఆస్పత్రి కాకుండా, టౌన్ లోని చాలా ప్రైవేట్ ఆస్పత్రులు, స్కానింగ్ సెంటర్లు అడ్డగోలుగా కుమ్మక్కు దందాకు తెరలేపినా అధికారులు అటువైపు చూడటం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి ఎదురుగా ఉన్న ఒక స్కానింగ్ సెంటర్‌లో ఏకంగా తప్పుడు రిపోర్టు ఇవ్వడంతో వైద్యులు ఆపరేషన్‌కు సిద్ధమయ్యారు.

చివరి నిమిషంలో రోగి బంధువులు అప్రమత్తమై ‘సెకండ్ ఒపీనియన్’ తీసుకోకపోతే, లేని రోగానికి ఆపరేషన్ చేసి, జేబులు ఖాళీ చేసేవారు. ప్రకాశం బజార్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ అవసరం లేకపోయినా మహిళలకు గర్భసంచి (హిస్టరెక్టమీ) ఆపరేషన్లు చేయడం నిత్యకృత్యంగా మారింది. సాక్షాత్తూ బాధితులు వచ్చి ఫిర్యాదులు చేసినా ఇప్పటివరకు సదరు ఆస్పత్రిపై వైద్యశాఖ అధికారులు ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడం గమనార్హం. వైద్యాధికారుల పక్షపాత వైఖరి వెనకాల మామూళ్లు మత్తే కారణమని బాధిత కుటుంబాలు ఆరోపిస్తున్నాయి.

అన్నింట్లోనూ తనిఖీలు చేపట్టాలనే డిమాండ్

పట్టణంలోని అన్ని ప్రైవేట్ ఆస్పత్రులు, డయాగ్నోస్టిక్ సెంటర్లలో నిరంతరం ఆకస్మిక తనిఖీలు చేపడితే అసలు నిజాలు బయటపడతాయి. ప్రామాణిక నిబంధనలు పాటించని, అవసరం లేకున్నా ఆపరేషన్లు చేస్తూ రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ప్రతి ఆస్పత్రిపై కఠిన చర్యలు తీసుకోవాలి. అధికారులు దాపరికాలు, పక్షపాతం చూపకుండా విధులు నిర్వహించాలని నల్లగొండ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>