ఇందిర‌మ్మ ఇండ్లు.. ప్రైవేటు సంస్థ‌ల‌ వ‌సూళ్లు!

క‌లం, మెద‌క్ బ్యూరో: ఇందిరమ్మ ఇల్లు (Indiramma Housing).. సొంతింటి కలను నెరవేర్చుకోవాలనుకునే పేదలకు ప్రభుత్వం అందిస్తున్న ఓ భరోసా. అయితే ఇదే పథకాన్ని ఆసరాగా చేసుకుని మెద‌క్ (Medak) జిల్లాలో ఓ ప్రైవేట్ సంస్థ భారీ మోసానికి తెరతీసింది. ఇండ్ల నిర్మాణం పూర్తి చేసే హ‌మీ త‌మ‌దేన‌ని నమ్మబలికి డబ్బులు వసూలు చేసినట్టు బాధితులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ పథకం పేరును అడ్డుపెట్టుకుని, నిరుపేద‌ల‌ను మోసం చేసిన‌ ప్రైవేట్ సంస్థపై చ‌ర్య‌లు తీసుకోవాల్సిన‌ అధికారులు చూసీచూడ‌నట్లు వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. మెద‌క్ జిల్లాలో ఇందిర‌మ్మ ఇండ్ల పేరిట జ‌రిగిన‌ ప్రైవేటు సంస్ధ దోపిడీ ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

నిరుపేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని (Indiramma Housing Scheme)
ప్రారంభించింది. ఈ ప‌థ‌కంలో భాగంగా ఇండ్లు లేని నిరుపేద‌ల‌కు ఇంటి నిర్మాణం కోసం రూ.5 ల‌క్ష‌లు ప్ర‌భుత్వం స‌హాయం చేస్తుంది. ఇంటి నిర్మాణ ప‌నులు జ‌రుతుతున్న ద‌శ‌ల‌ను బ‌ట్టి బిల్లుల‌ను వాయిదాల ప‌ద్ధ‌తిలో మొత్తం ఐదు ల‌క్ష‌ల వ‌ర‌కు అందిస్తుంది. ప్ర‌భుత్వం ఇండ్లు లేని వారి కోసం తీసుకువ‌చ్చిన ఈ ప‌థ‌కం ల‌క్ష్యం మెద‌క్ జిల్లాలో కొందరు ప్రైవేట్ వ్యాపారుల ధ‌న దాహానికి, అధికారుల నిర్లక్ష్యానికి నీరుగారిపోతుంది.

అస‌లు ఏం జ‌రిగిందంటే..?

మెద‌క్ జిల్లాలోని చేగుంట‌, నార్సింగి మండ‌లాల‌లో ఇందిర‌మ్మ ఇండ్లు మంజూర‌య్యాయి. అయితే నిర్మాణానికి అవ‌స‌ర‌మైన డ‌బ్బులు లేక‌పోవ‌డంతో కొంద‌రు ప‌నులను మొద‌లు పెట్టలేదు. ఇదే అవ‌కాశంగా భావించిన షేర్ వాల్ టెక్నాలజీ అనే సంస్ధ కొత్త టెక్నాలజితో వేగంగా తామే ఇంటి నిర్మాణాలు పూర్తి చేసి ఇస్తామ‌ని ల‌బ్ధిదారుల‌ను న‌మ్మించింది. ఇంటి నిర్మాణం పూర్త‌యిన‌ త‌ర్వాత‌నే గృహ నిర్మాణ శాఖ అధికారుల స‌మ‌క్షంలో డ‌బ్బులు తీసుకుంటామ‌ని ల‌బ్దిదారుల‌తో అగ్రిమెంట్లు కూడా చేసుకున్నారు. దీనికి ముందే ఇందిర‌మ్మ ఇండ్లు మంజూరై, ఆర్ధిక స్ధోమ‌త స‌రిగా లేక‌ నిర్మాణాల‌కు ముందుకు రాని వారి జాబితాను గృహ నిర్మాణ శాఖ అధికారుల ద్వారా తీసుకున్నారు. ఇండ్ల నిర్మాణ బాధ్య‌త‌లు ప్రైవేటు సంస్థ‌కు అప్ప‌గించి, కొత్త ఇంటి నిర్మాణం పూర్త‌వ‌డం కోసం ఎదురు చూసిన పేద‌ల‌కు గ‌ట్టి ఎదురుదెబ్బ త‌గిలింది.

నమ్మించి దగా చేసిన ప్రైవేట్ సంస్థ..!

చేగుంట మండలం రుక్మాపూర్మం గ్రామంలో మంజూరైన 25 ఇళ్లలో 11 మంది సొంతంగా ఇండ్లు నిర్మించుకున్నారు. మిగిలిన ఇళ్ల నిర్మాణ‌ బాధ్యతను అధికారులు షేర్‌వాల్‌ టెక్నాలజి సంస్థకు అప్పగించారు. మొద‌టి విడ‌త డ‌బ్బులు ఖాతాల్లో ప‌డేందుకు పునాది వ‌ర‌కు పనులు చేసి, రూ.లక్ష చొప్పున మంజూరైన న‌గ‌దు వసూలు చేసి సంస్థ ప్రతినిధులు ఉడాయించారని లబ్ధిదారులు చెప్తున్నారు.

నార్సింగి మండ‌లంలో మంజూరైన 80 ఇళ్లలో 14 రద్దయ్యాయి. 47 మంది సొంతంగా కట్టుకున్నారు. మిగతా ఇళ్లను శర్వాన్ సంస్థకు అప్పగించగా, పునాది దశలోనే పనులు వదిలేసి పత్తా లేకుండా పోయారంటున్నారు. రెడ్డిపల్లి గ్రామంలో మంజూరైన 32 ఇళ్లలో ప్రైవేటు సంస్థకు పనులు అప్పగించిన లబ్ధిదారుల నుండి పునాదుల దశలోనే రూ. లక్ష వసూలు చేసి పనులు మధ్యలోనే నిలిపివేశారని చెప్తున్నారు. ఇంకా ఇత‌ర ప్రాంతాల్లో ఇదే త‌ర‌హాలో ఇండ్లు క‌ట్టిస్తామ‌ని మోసం చేసిన వివ‌రాలు తెలియాల్సి ఉంది.

ల‌క్ష వసూల్‌.. ఆ త‌ర్వాత‌ ప‌రార్..

ప్రైవేట్ సంస్థలు పునాది కూడా పూర్తి చేయ‌కుండా, కేవలం నేల పైన మాత్రమే బీమ్స్ నిర్మించి నాణ్యతా ప్రమాణాలను గాలికి వదిలేశాయి.ఇంటి నిర్మాణానికి అవ‌స‌మైన ఐర‌న్ రాడ్ లేకుండా సాదాసీదాగా పునాది పునాది పూర్తి చేశారు. పుట్టింగ్స్ లేకుండా నేల మీద‌నే ప్లింత్ బీమ్స్ వేసి వ‌దిలేశారు. త‌క్కువ ఖ‌ర్చుతో చ‌కాచ‌కా ప‌నులు చేసి మొదటి విడత కింద ప్రభుత్వం నుంచి లబ్ధిదారులకు అందాల్సిన రూ.లక్ష బిల్లును తమ ఖాతాల్లో వేయించుకున్నారు. డ‌బ్బులు అందిన మ‌రు క్ష‌ణ‌మే ప‌నుల‌ను ఎక్క‌డిక‌క్క‌డ నిలిపివేశారు.

గత ఏడాది కాలంగా ఈ ఇండ్ల‌ నిర్మాణాలు నిలిచిపోయి ఉన్నాయి. దీంతో లబ్ధిదారులు ఉండటానికి ఇళ్లు లేక అద్దె ఇళ్లలో, తాత్కాలిక పాకల్లో నానా అవస్థలు పడుతున్నారు. ఇళ్లు నిర్మించి ఇస్తామంటే, అధికారుల స‌మ‌క్షంలోనే కంపెనీ వాళ్ల‌తో సంతకాలు చేశామ‌ని, తీరా ఎలాంటి అధారం లేకుండా భూమి మీద ప్లింత్ బీమ్స్ వేసి ల‌క్ష రూపాయ‌ల బిల్లు తీసుకొని, మిగిలిన నిర్మాణ‌ ప‌నులు చేయ‌డం లేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఏడాది కాలంగా కంపెనీ వాళ్లకు ఎన్ని సార్లు ఫోన్లు చేసినా ప‌ట్టించుకోవ‌డం లేద‌ని బాధితులు వాపోతున్నారు.

చేతులెత్తేస్తున్న‌ అధికారులు

బాధితులు గృహ నిర్మాణ శాఖ అధికారులకు ఈ మోసం గురించి చెబితే ఆ ల‌క్ష రూపాయ‌ల విష‌యంలో ఏమీ చేయ‌లేమ‌ని స‌మాధానం చెప్పిన‌ట్లు వెల్ల‌డించారు. ఇప్పుడు ఉన్న ప‌రిస్థితి నుండి ఇళ్లు క‌ట్టుకుంటే ద‌శ‌ల వారీగా ప్ర‌భుత్వం త‌ర‌ఫున‌ మిగిలిన నాలుగు ల‌క్ష‌లు మంజూరు చేపిస్తామ‌ని చెబుతున్నార‌ట‌. కానీ, కంపెనీ వాళ్లు తీసుకున్న ల‌క్ష రూపాయ‌ల విష‌యానికి, త‌మ‌కు సంబంధం లేద‌ని అంటున్నార‌ని ఆ కంపెనీల బాధితులు అంటున్నారు.

మ‌రోవైపు అధికారులు బాధితులకు న్యాయం చేయాల్సింది పోయి లబ్ధిదారులదే తప్పంటూ నెపం నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారనే అరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. ఏడాది కాలంగా ఇండ్లు క‌ట్ట‌కుండా త‌మ‌ను మోసం చేసిన సంస్థలకు అధికారులు కొమ్ముకాస్తున్నార‌ని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే ఉన్నతాధికారులు స్పందించి బాధ్యులపై చట్టపరమైన క‌ఠిన‌ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప‌లు గ్రామాల్లో ప్రైవేటు సంస్థ‌ల‌ మోసం వ‌ల్ల‌ నిలిచిపోయిన నిర్మాణాలను పూర్తి చేయించి బాధితులకు ఆసరాగా నిలవాలని కోరుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>