కలం, కరీంనగర్ : హుజురాబాద్ మండలం సిర్సపల్లి సమీపంలో జాతీయ రహదారి 563ని ఆనుకొని ఉన్న డంపింగ్ యార్డ్ ను జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా (Chitra Mishra) గురువారం రాత్రి పరిశీలించారు. జాతీయ రహదారిని ఆనుకొని డంపింగ్ యార్డ్ ఉండడం పట్ల భారత జాతీయ రహదారుల ప్రాధికారత సంస్థ అభ్యంతరం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ స్థలాన్ని జిల్లా కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా రెవెన్యూ, మునిసిపల్ అధికారులకు పలు సూచనలు చేశారు.
జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న స్థలంలో కొంత దూరం వరకు చెత్త డంప్ చేయడం నిలిపివేయాలని అన్నారు. ఇదే స్థలంలో రహదారికి కొంత దూరం తర్వాత డంప్ చేయాలని సూచించారు. రహదారిని అనుకున్న స్థలంలో పచ్చదనం పెంపొందించాలని, మొక్కలు నాటి సంరక్షించాలని అన్నారు. రెవిన్యూ, మున్సిపల్ అధికారులు సమన్వయంతో చెత్త సేకరించే వాహనాలు జాతీయ రహదారి నుండి కాకుండా ప్రత్యామ్నాయ మార్గాల నుండి ఈ స్థలంలోకి వచ్చి డంప్ చేసేలా ప్రణాళిక సిద్ధం చేసి అమలు చేయాలని అన్నారు.
జాతీయ రహదారి నుండి చెత్త సేకరణ వాహనాలు వెళ్లకుండా చూడాలని, హుజూరాబాద్ పట్టణంలోని డివిజన్ల వారీగా సేకరించిన చెత్త డంప్ యార్డులో వేసేందుకు వివిధ ప్రత్యామ్నాయ మార్గాలను సిద్ధం చేయాలని ఆదేశించారు. రహదారిని ఆనుకొని చెత్త వేయకుండా చూడాలని అన్నారు. కలెక్టర్ వెంట అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, ఆర్టీవో జల కుమారి, ఎన్‌హెచ్‌ఏఐ ప్రాజెక్టు డైరెక్టర్ భరద్వాజ్, తహసిల్దార్ నరేందర్ పాల్గొన్నారు.

