విద్యుత్ ప్రీపెయిడ్ విధానంతో ఇబ్బందులు: డాక్టర్ రఘు

కలం, కోరుట్ల: విద్యుత్‌ వినియోగానికి ప్రీపెయిడ్‌ విధానాన్ని తీసుకురావాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామని తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్‌) పార్టీ కోరుట్ల నియోజకవర్గ ఇన్‌ఛార్జి డాక్టర్ రఘు అన్నారు. పార్టీ నేతలతో కలిసి గురువారం కోరుట్ల (Korutla) బస్టాండ్‌ వద్ద భారీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ రఘు మాట్లాడుతూ.. స్మార్ట్‌ మీటర్ల ఏర్పాటుకు తాము వ్యతిరేకం కాదని, అయితే విద్యుత్‌ వినియోగానికి ముందుగానే డబ్బులు చెల్లించే ప్రీపెయిడ్‌ విధానాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. మొబైల్‌ ఫోన్‌కు రీఛార్జ్‌ చేసుకుంటేనే సేవలు అందుబాటులోకి వచ్చినట్లుగా.. రేపు రీఛార్జ్‌ చేసుకుంటేనే విద్యుత్ సరఫరా జరిగే విధానం ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తుందని పేర్కొన్నారు.

పేద గ్రామీణ వర్గాలపై ప్రభావం..

ప్రభుత్వ నిర్ణయం పేద గ్రామీణ వర్గాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని డాక్టర్ రఘు ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లోని పేద ప్రజలకు ముందస్తు రీఛార్జ్‌ విధానం గురించి అవగాహన లేకపోవడంతో మరిన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందన్నారు. ఈ విధానాన్ని ఉత్తరప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాలు కూడా వ్యతిరేకించాయని గుర్తుచేశారు. స్మార్ట్‌ మీటర్లకు సంబంధించిన విధివిధానాలను ప్రభుత్వం స్పష్టంగా అందించాలని డిమాండ్‌ చేశారు. పార్టీ అధినేత్రి కల్వకుంట్ల కవిత ప్రతిపాదిస్తున్న పంచాజన్య సంకల్పంలోని ఉచిత విద్య, ఉచిత వైద్యం, యువతకు ఉపాధి, రైతు భరోసా, సామాజిక న్యాయం వంటి అంశాలను ప్రజలకు అందించాలని కోరారు.

 ప్రజలపై భారం మోపొద్దు..

పార్టీ సీనియర్ నేత అజార్ మాట్లాడుతూ.. పేద, మధ్య తరగతి కుటుంబాలపై భారం పడే విధానాలను ప్రభుత్వం అమలు చేయడం మానుకోవాలన్నారు. ప్రజల ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటికే విద్యుత్‌ బిల్లులు, నిత్యావసరాల ధరలు, ఇతర ఖర్చులతో సామాన్య కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని వివరించారు. ఈ పరిస్థితుల్లో స్మార్ట్ మీటర్ల పేరుతో మరో భారం మోపడం ప్రజలకు ఆందోళన కలిగించే అంశమని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రక్షణ సేన నియోజకవర్గ నాయకులు సుఖేందర్ గౌడ్, లింగంపల్లి సంజీవ్, సాయి రెడ్డి, శివారెడ్డి, రాజన్న, నాగరాజు, సోమిడి ప్రశాంత్, కోరుట్ల రాజు, మందుల విజయ్, ఆరిఫ్, మతిన్, ఇర్ఫాన్ ముస్తఫా, ఖలీద్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>