కలం, వెబ్డెస్క్: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu)కు ఏడీసీగా పని చేసి సోషల్ మీడియాలో ఎంతో ఫేమస్ అయిపోయిన మేజర్ రిషబ్ సింగ్ సంబ్యాల్ (Major Rishabh Singh Sambyal) సైనిక సేవల నుంచి రిటైర్ అయ్యారు. రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతిని ఆయన కలిసిన సందర్భంగా ఆయనకు సంబంధించిన పోస్టులో మేజర్ రిషబ్ సంబ్యాల్, మాజీ రాష్ట్రపతి ఏడీసీ అని అధికారికంగా పేర్కొనడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
మేజర్ రిషబ్ రాష్ట్రపతి అధికారిక కార్యక్రమాలు, వేడుకల్లో ఆమెతో కలిసి ఎంతో అంకితభావంతో పని చేసే వారు. ఇలా ఆయన సేవలు అందిస్తున్న వీడియోలతో సోషల్ మీడియాలో చాలా పాపులర్ అయ్యారు. రాష్ట్రపతికి గొడుగు పట్టడం, ఆమె వచ్చే ముందు చుట్టూ పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించడం వంటి జాగ్రత్తలతో ఆయన ప్రదర్శించిన క్రమశిక్షణ, నైపుణ్యాలకు ప్రజల నుంచి ప్రశంసలు అందుకున్నారు.
రాష్ట్రపతి భవన్కు రాకముందు ఆయన భారత సైన్యానికి చెందిన ప్రతిష్టాత్మక 4 స్పెషల్ ఫోర్సెస్లో సేవలందించారు. 2021 గణతంత్ర దినోత్సవ పరేడ్లో జాట్ రెజిమెంట్ కంటిన్జెంట్కు నాయకత్వం వహించి ఉత్తమ కంటిన్జెంట్ ట్రోఫీని గెలుచుకొని తొలిసారి దేశవ్యాప్త గుర్తింపు పొందారు. రాష్ట్రపతి ఏడీసీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత సోషల్ మీడియాలో చాలా ఫేమస్ అయ్యారు.

