పెద్ద సార్‌ రాలేదా.. నిర్మల్ రవాణా శాఖలో డ్యూటీల గోల్‌మాల్?

కలం, నిర్మల్: నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం చించోలి (బి) గ్రామంలో ఉన్న జిల్లా రవాణా శాఖ (Nirmal RTO) అధికారి కార్యాలయంలో ఉద్యోగుల హాజరు, విధుల నిర్వహణపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సాధారణంగా ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులకు సెలవులు లేకుంటే వారంలో ఆరు రోజులు విధులకు హాజరవుతుండగా.. ఈ కార్యాలయంలో మాత్రం కొందరు అధికారులు “వంతుల” వారీగా విధులు నిర్వహిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కార్యాలయంలో జిల్లా రవాణా శాఖ అధికారితోపాటు ఇద్దరు ఎంవీఐలు, నలుగురు ఏఎంవీఐలు, ముగ్గురు కానిస్టేబుళ్లు, ఐదుగురు హోంగార్డులు, సీనియర్‌ అసిస్టెంట్‌, జూనియర్‌ అసిస్టెంట్‌, అటెండర్‌, డీబీఏ, ఇద్దరు ప్రైవేట్‌ సెక్యూరిటీ గార్డులు పనిచేస్తున్నట్లు సమాచారం.

అయితే ఇద్దరు ఎంవీఐల్లో ఒకరు సోమ, మంగళ, బుధవారాలు.. మరొకరు గురు, శుక్ర, శనివారాలు మాత్రమే విధులకు హాజరవుతున్నారని తెలుస్తోంది. ఇక జిల్లా రవాణా శాఖ అధికారి కార్యాలయానికి ఏ రోజున వస్తారో స్పష్టత లేకుండా పోయిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ‘పెద్ద సార్‌ రాలేదా?’ అని సిబ్బందిని అడిగితే.. ‘‘హైదరాబాద్‌‌లో మీటింగ్‌‌లో ఉన్నారు’’ అంటూ సమాధానం వస్తోందని చెబుతున్నారు. అత్యవసర సమీక్షా సమావేశాలు, కలెక్టర్‌ కార్యాలయంలో జరిగే అధికారిక సమావేశాలు ఉన్నప్పుడు జిల్లా రవాణా శాఖ అధికారి హాజరవుతున్నప్పటికీ.. ప్రతిరోజూ కార్యాలయంలో అందుబాటులో ఉంటున్నారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

బయోమెట్రిక్‌.. ఎఫ్ఆర్‌ఏఎస్‌ ఎందుకు లేదు?

నిర్మల్‌ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు సిబ్బంది కోసం ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ సిస్టమ్ (ఎఫ్ఆర్‌ఏఎస్‌), జిల్లా సమీకృత కలెక్టరేట్‌‌లో ఉద్యోగుల హాజరు పర్యవేక్షించేందుకు బయోమెట్రిక్‌ విధానం అమల్లో ఉంది. ఉద్యోగి ఏ సమయానికి విధులకు వచ్చారు? ఎప్పుడు వెళ్లారు? వివరాలను అధికారులు పర్యవేక్షించే అవకాశం ఉంది. అలాంటప్పుడు జిల్లా రవాణా శాఖ కార్యాలయంలోనూ బయోమెట్రిక్‌‌తోపాటు ఎఫ్ఆర్‌ఏఎస్‌ వ్యవస్థను ఏర్పాటు చేయకపోవడంపై ప్రజలు ప్రశ్నిస్తున్నారు. జిల్లా రవాణా శాఖ అధికారితో పాటు ఇద్దరు ఎంవీఐలు ప్రతిరోజూ కార్యాలయానికి హాజరవుతున్నారా? లేదా? అనే విషయాన్ని సీసీ కెమెరాల ఫుటేజీ పరిశీలిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని ప్రజలు అంటున్నారు. “వంతుల” వారీగా విధులు నిర్వహించేందుకు ఏమైనా అధికారిక అనుమతులు ఉన్నాయా? అనే అంశాలపై రవాణా శాఖ ఉన్నతాధికారులు విచారణ చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

డ్రైవింగ్‌ లైసెన్సులపై సంతకాలతో లెక్క తేలేనా?

డ్రైవింగ్‌ లైసెన్స్‌‌ల కోసం కార్యాలయానికి వచ్చే ప్రజలకు మంజూరు చేస్తున్న లైసెన్స్‌ పత్రాలపై సంబంధిత ఎంవీఐ అధికారుల సంతకాలను పరిశీలిస్తే అసలు విషయం వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని ప్రజలు అంటున్నారు. ఏ వారంలో ఏ ఎంవీఐ అధికారి ఎన్ని లైసెన్స్‌ పత్రాలపై సంతకాలు చేశారు? ఏ తేదీల్లో విధులకు హాజరయ్యారు? అనే వివరాలను పరిశీలిస్తే అసలు విషయాలు తెలిసే అవకాశం ఉంటుందంటున్నారు. సదరు అధికారులు లైసెన్స్‌ పత్రాలపై ఉన్న సంతకాలతో పాటు హాజరు రిజిస్టర్‌, సీసీ కెమెరాల ఫుటేజీని సమగ్రంగా పరిశీలించాలని డిమాండ్ చేస్తున్నారు. నెలలో కొద్దిరోజులు మాత్రమే విధులకు హాజరవుతున్నారనే ఆరోపణలు నిజమైతే సంబంధిత అధికారులపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

స్వాతంత్ర్య వేడుకలకు డుమ్మా

రవాణా శాఖ కార్యాలయంలో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను జిల్లా రవాణా శాఖ అధికారితో పాటు ఎంవీఐ, ఏఎంవీఐ హాజరు కాలేదన్న సమాచారం బయటకు వచ్చింది. సాధారణంగా కార్యాలయ సిబ్బంది అంతా విధిగా హాజరై జెండా వందన కార్యక్రమంలో పాల్గొంటారు. అలాంటి ముఖ్యమైన రోజున ఉన్నతాధికారులు సైతం గైర్హాజరు కావడంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. జాతీయ పర్వదినం సందర్భంగా విధులకు గైర్హాజరయ్యేందుకు సంబంధిత అధికారులకు ఏమైనా ప్రత్యేక మినహాయింపు ఉందా? ఒకవేళ సెలవు తీసుకున్నట్లయితే ఉన్నతాధికారుల అనుమతి తీసుకున్నారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు స్పష్టత ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు.

విచారణ చేపడతాం: పి. రవీందర్‌ కుమార్, డీటీసీ

నిర్మల్ జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో వంతుల వారీగా విధులు, ఇతర విషయాలపై డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ (డీటీసీ) పి.రవీందర్‌ కుమార్ వివరణ కోరగా స్పందించారు. ఈ విషయం తన దృష్టికి రాలేదని, దీనిపై విచారణ చేపడతామని చెప్పారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఎవరైనా గైర్హాజరైనట్లు తనకు ఎలాంటి సమాచారం లేదన్నారు. ఒకవేళ సెలవు తీసుకున్నట్లయితే తప్పనిసరిగా కలెక్టర్‌ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>