కలం, వెబ్ డెస్క్ : భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu) రెండు రోజుల పర్యటన నిమిత్తం మంగళవారం ఆంధ్రప్రదేశ్‌కు చేరుకుంటున్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో ఏర్పాటైన రెండు ప్రతిష్టాత్మక కేంద్ర విశ్వవిద్యాలయాల తొలి స్నాతకోత్సవాలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. పర్యటనలో భాగంగా మంగళవారం మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో ఆమె విశాఖపట్నం చేరుకుంటారు.
విశాఖపట్నంలోని వి కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించనున్న కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం (CTUAP) ప్రథమ స్నాతకోత్సవ వేడుకల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu) పాల్గొని, విద్యార్థులకు పట్టాలు, బంగారు పతకాలను అందజేస్తారు. ఈ గిరిజన విశ్వవిద్యాలయం ప్రస్తుతం విజయనగరం జిల్లా కొండకరకంలో తాత్కాలిక క్యాంపస్ నుండి కార్యకలాపాలు సాగిస్తోంది. దేశ చరిత్రలోనే తొలి గిరిజన మహిళా రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన ద్రౌపది ముర్ము గిరిజన వర్సిటీ స్నాతకోత్సవానికి హాజరుకావడం విశేషం.
ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా హాజరుకానున్నారు. ఈ స్నాతకోత్సవంలో మొత్తం 373 మంది విద్యార్థులకు డిగ్రీలు, 13 మంది ప్రతిభావంతులకు బంగారు పతకాలు ప్రదానం చేయనున్నారు. విశాఖలో కార్యక్రమం ముగిసిన అనంతరం రాష్ట్రపతి వాయుమార్గంలో బెంగళూరు బయలుదేరి వెళ్లి అక్కడ బస చేస్తారు.
రెండో రోజైన బుధవారం (జులై 1) ఉదయం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బెంగళూరు నుంచి హెలికాప్టర్ ద్వారా అనంతపురానికి చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసిన కేంద్ర విశ్వవిద్యాలయం (CUAP) మొదటి స్నాతకోత్సవ వేడుకల్లో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొంటారు. రెండు వర్సిటీల తొలి స్నాతకోత్సవాలకు రాష్ట్రపతి హాజరవుతుండటంతో అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు పూర్తి చేశారు.

