అమ్మతో పాటే అనంత లోకాలకు.. గర్భిణీ దుప్పి మృతి!

కలం, ఖమ్మం బ్యూరో: అమ్మతో పాటే ఆ కడుపులోని బిడ్డ కూడా అనంత లోకాలకు చేరుకుంది. అటవీ ప్రాంతంలో వేటగాళ్లు అమర్చిన ఉచ్చు ఒక నిండు గర్భిణీ దుప్పి దారుణ మృతికి కారణమైంది. తీవ్ర గాయాలతో ప్రాణాల కోసం పోరాడిన తల్లి దుప్పితో పాటు శస్త్రచికిత్స చేసి కడుపులోని బిడ్డనైనా కాపాడాలన్న వైద్యుల నిస్సహాయ పోరాటం ఫలించకపోవడం తీవ్ర విషాదం నింపింది.

​భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ (Palwancha) అటవీ పరిధిలోని మాదారం సమీపంలో కొందరు వేటగాళ్లు ప్రమాదకరమైన తీగలతో ఉచ్చులు అమర్చారు. ఆహారం కోసం సంచరిస్తూ వచ్చిన ఒక ఆడ దుప్పి ఆ ఉచ్చులో చిక్కుకుంది. ఉచ్చు నుంచి విడిపించుకునేందుకు అది చేసిన ప్రయత్నంలో మెడ, శరీర భాగాలకు వైర్లు బిగుసుకుపోయి తీవ్ర గాయాలయ్యాయి. రోడ్డుపై పడుతూ లేస్తూ పరుగెడుతున్న దుప్పిని గమనించిన అటవీ శాఖ సిబ్బంది వెంటనే స్పందించి, దానిని పాల్వంచ వెటర్నరీ ఆసుపత్రికి తరలించారు.

​వెటర్నరీ వైద్యుడు డాక్టర్ ఇందు తేజ ఆసుపత్రికి చేరుకుని అత్యవసర చికిత్స ప్రారంభించారు. పరిశీలనలో ఆ దుప్పి నిండు గర్భిణీ అని గుర్తించినప్పటికీ, అప్పటికే తీవ్ర రక్తస్రావం కావడం, గాయాల తీవ్రత ఎక్కువవ్వడంతో చికిత్సకు స్పందించక తల్లి దుప్పి కన్నుమూసింది. అయితే కనీసం కడుపులోని బిడ్డనైనా బ్రతికించాలనే ఉద్దేశంతో వైద్యులు వెంటనే శస్త్రచికిత్స చేసి పిండాన్ని బయటకు తీశారు. కానీ, అప్పటికే కడుపులోని బిడ్డ కూడా ప్రాణాలు కోల్పోవడంతో ఆ ప్రయత్నం విఫలమైంది.

​ఈ ఘోర ఘటనపై స్థానికులు, పర్యావరణ ప్రేమికులు తీవ్ర దిగ్భ్రాంతి, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అడవుల్లో స్వేచ్ఛగా తిరిగే వన్యప్రాణులను పొట్టనబెట్టుకుంటున్న వేటగాళ్లపై అటవీ శాఖ అధికారులు ఉక్కుపాదం మోపాలని, అటవీ ప్రాంతాల్లో నిరంతర గస్తీ పెంచి ఉచ్చులను వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే అత్యవసర సమయంలో వన్యప్రాణులకు తక్షణ వైద్య సేవలు అందేలా వెటర్నరీ వసతులను పటిష్టం చేయాలని విజ్ఞప్తి చేశారు. మృతి చెందిన దుప్పికి పోస్టుమార్టం పూర్తి చేసిన అనంతరం కళేబరాన్ని అటవీ అధికారులకు అప్పగించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, ఉచ్చులు వేసిన దుండగులను త్వరలోనే గుర్తించి కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అటవీ శాఖ అధికారులు తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>