కలం, నాగర్ కర్నూల్: ముఖ్యమంత్రి, మంత్రులు జిల్లాలోని ప్రాజెక్టును సందర్శించిన సమయంలో రూ.1,000 కోట్ల నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చి, ఇప్పటివరకు ఎందుకు విడుదల చేయలేదని మాజీ మంత్రి డాక్టర్ నాగం జనార్దన్ రెడ్డి(Nagam Janardhan Reddy) ప్రశ్నించారు. బుధవారం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ తొలి మలిదశ ఉద్యమంలో ప్రజలను చైతన్యపరిచిన విధంగానే ప్రస్తుతం రైతులను చైతన్యపరిచేందుకు సిద్ధమవుతున్నట్లు నాగం తెలిపారు. రాష్ట్ర సాధన ఉద్యమంలో ఆత్మబలిదానాలు చేసిన వారి ఆశయాలను నిర్వీర్యం చేయకుండా విద్య, వైద్యం, ఉపాధి రంగాల్లో ప్రజలకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులను నార్లాపూర్ వద్ద ప్రారంభిస్తే కేఎల్‌ఐ ప్రాజెక్టుకు ఇబ్బందులు ఏర్పడతాయని తాను గతంలో లేఖల ద్వారా హెచ్చరించినా పట్టించుకోకుండా అక్కడే పనులు ప్రారంభించారని ఆరోపించారు. ఫలితంగా ఐదు మోటార్లు దెబ్బతిన్నాయని, ఏళ్లు గడుస్తున్నా వాటిని పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకురావడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ప్రస్తుతం రెండు మోటార్లు మాత్రమే పనిచేయడం వల్ల రైతుల ఆయకట్టుకు పూర్తిస్థాయిలో సాగునీరు అందడం లేదన్నారు. ఐదు మోటార్లు పనిచేసి ఉంటే ప్రతిరోజూ రెండు టీఎంసీల చొప్పున 40 రోజుల పాటు నీటిని వినియోగించుకుని పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలోని ఐదు రిజర్వాయర్లను నింపి పూర్తి ఆయకట్టుకు సాగునీరు అందించే అవకాశం ఉండేదని తెలిపారు.
రైతులను చైతన్యపరిచి ఉద్యమాల ద్వారా వారి ఆయకట్టుకు నీరు అందించేలా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతానని నాగం పేర్కొన్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావు నిర్లక్ష్యం వల్లే కాలువల సామర్థ్యాన్ని తగ్గించారని, నార్లాపూర్ నుంచి అండర్‌గ్రౌండ్ పనులకు అనుమతులు ఇవ్వడంలో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. ముఖ్యమంత్రి ప్రకటించిన రూ.1,000 కోట్ల నిధులను వెంటనే విడుదల చేసి కేఎల్‌ఐ డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ నిర్మించాలని డిమాండ్ చేశారు. వట్టెం రిజర్వాయర్ ద్వారా డిండి ప్రాజెక్టుకు నీటిని తరలించే అవకాశం ఉన్నప్పటికీ, కాంట్రాక్టర్ల ప్రయోజనాల కోసం ఏదుల నుంచి నీటిని తరలించే పనులకు నిధులు మంజూరు చేశారని ఆరోపించారు. సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లాకు నీటిని తరలించేందుకు రూ.1,800 కోట్ల నిధులు మంజూరు చేశారని, ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు ఎందుకు ప్రశ్నించడం లేదని నాగం ప్రశ్నించారు.
ప్రజలకు అండగా ఉండేందుకు తాను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని నాగం జనార్దన్ రెడ్డి తెలిపారు. యువత ఉద్యమాలను అణిచివేసేందుకు దాడులు చేయడం, బాష్పవాయువు ప్రయోగించడం సరికాదన్నారు. ఉద్యమాల ద్వారానే దేశ పరిరక్షణ సాధ్యమవుతుందని పేర్కొంటూ వ్యవస్థలో రాజకీయ జోక్యాన్ని తగ్గించాలని పిలుపునిచ్చారు. సమావేశంలో యువ నేత నాగం శశిధర్ రెడ్డి, నాయకులు అర్థం రవి, బాలా గౌడ్, అర్జునయ్య, భీముడు, సత్యం, అహ్మద్ డిష్ రాజు, దామోదర్, విష్ణుచారి, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.

