కలం, మిర్యాలగూడ: రాష్ట్రంలో తీవ్ర సంచలనం సృష్టించిన మిర్యాలగూడ ప్రణయ్ (Miryalaguda Pranay) హత్య కేసులోని ఏ4 నిందితుడు మహ్మద్ అబ్దుల్ బారీ (Abdul Bari) మృతి చెందాడు. చర్లపల్లి జైలులో జీవిత ఖైదు అనుభవిస్తున్న బారీ హఠాత్తుగా తీవ్ర గుండెనొప్పితో అస్వస్థతకు గురయ్యాడు. ఈ విషయాన్ని గమనించిన జైలు అధికారులు అతడిని అత్యవసర చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బారీ తుదిశ్వాస విడిచినట్లు జైలు వర్గాలు వెల్లడించాయి.
నల్లగొండ పట్టణంలోని ప్యారసభాగ్ కాలనీకి చెందిన మహ్మద్ అబ్దుల్ బారీకి తీవ్ర నేర చరిత్ర ఉంది. గతంలో గుజరాత్ మాజీ హోంమంత్రి హరేన్ పాండ్యా హత్య కేసులోనూ ఇతడు నిందితుడిగా ఉండి జైలు శిక్ష అనుభవించాడు. ఆ తర్వాత మిర్యాలగూడకు చెందిన పెరుమాళ్ల ప్రణయ్ హత్య కేసులో ఏ4 నిందితుడిగా ఉన్న బారీకి న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రి మార్చురీలో భద్రపరిచారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించనున్నట్లు జైలు అధికారులు తెలిపారు.

