కలం, వెబ్ డెస్క్: సోషల్ మీడియాలో సంచలనం సృష్టించిన కాక్రోచ్ జనతా పార్టీ (Cockroach Janta Party) తన తొలి నిరసనకు సిద్ధమవుతోంది. కాక్రోచ్ పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ డిప్‌కే ఈ నెల 6న ఢిల్లీకి రానున్నారు. నీట్ పేపర్ లీక్, పరీక్ష రద్దు, దేశంలో విద్యా శాఖ వైఫల్యాలపై జంతర్ మంతర్ వద్ద భారీ నిరసన చేపట్టనున్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా వివరాలు వెల్లడించిన ఆయనకు ప్రముఖుల నుంచి మద్దతు లభిస్తోంది. ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ (Prakash Raj) ఎక్స్ వేదికగా కాక్రోచ్ పార్టీకి మద్దతు ప్రకటించారు.
ఈ మేరకు కాక్రోచ్ పార్టీపై ప్రకాశ్ రాజ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తాను ప్రస్తుతం ఒక సినిమా షూటింగ్‌లో బిజీగా ఉండటం వల్ల కాస్త దూరంగా ఉన్నానని చెప్పారు. అయినప్పటికీ ముందే చేసుకున్న ప్రణాళికలను రద్దు చేసుకొని ఎలాగైనా ఈ నెల 6వ తేదీన అక్కడికి చేరుకుని ఆ ఉద్యమానికి తన సంఘీభావాన్ని తెలియజేస్తానన్నారు. అంతేకాకుండా యువ కాక్రోచ్‌లు అందరూ ఈ నిరసనలో భారీ ఎత్తున పాల్గొనాలని ప్రకాష్ రాజ్ పిలుపునిచ్చారు. ఇక ప్రకాశ్ రాజ్ చేసిన పోస్టుకు కాక్రోచ్ పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ డిప్‌కే స్పందించారు. తమకు మద్దతు తెలిపినందుకు ప్రకాశ్ రాజ్‌కు ధన్యవాదాలు తెలిపారు. అలాగే ఇప్పుడు కాక్రోచ్‌ల వంతు వచ్చిందంటూ అభిజీత్ తన పోస్టులో రాసుకొచ్చారు.

