కలం, స్పోర్ట్స్ : భారత్ చెస్ గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద (Praggnanandhaa)కు ఇప్పుడు సూపర్ చెస్ క్లాసిక్‌లో కీలక దశ మొదలైంది. బుకారెస్ట్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో వరుస డ్రాలతో ముందుకెళ్తున్న భారత గ్రాండ్‌మాస్టర్.. ఆరో రౌండ్‌లో రొమేనియాకు చెందిన బోగ్డాన్-డానియెల్ డీక్‌తో తలపడనున్నాడు. ఈ మ్యాచ్‌లో గెలిచి మళ్లీ విజయాల బాట పట్టాలని ప్రగ్యానందా భావిస్తున్నాడు. ఐదు రౌండ్లు ముగిసే సరికి జర్మనీ గ్రాండ్‌మాస్టర్ విన్సెంట్ కైమర్ 3.5 పాయింట్లతో ఒంటరిగా అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అతని కంటే అర పాయింట్ వెనుక ప్రగ్యానందాతో పాటు అనీష్ గిరి, జోర్డెన్ వాన్ ఫొరెస్ట్, అమెరికా స్టార్ ఫాబియానో కారువానా ఉన్నారు.
నాలుగో రౌండ్‌లో ఫ్రాన్స్ ఆటగాడు అలిరెజా ఫిరూజ్జా గాయపడటంతో వాయిదా పడిన మ్యాచ్‌లో కారువానా విజయం సాధించాడు. దీంతో అతను కూడా రెండో స్థానానికి చేరుకున్నాడు. ప్రగ్యానందా ఇప్పటివరకు ఉజ్బెకిస్థాన్ ఆటగాడు జావోఖిర్ సిందరోవ్‌పై మాత్రమే విజయం సాధించాడు. మిగతా నాలుగు గేమ్స్ డ్రాగా ముగిశాయి. దీంతో టోర్నీ రెండో భాగంలో అతనిపై ఒత్తిడి పెరిగింది. ముఖ్యంగా ముందున్న మ్యాచ్‌లు మరింత కఠినంగా మారనున్నాయి.
ఆరో రౌండ్‌లో బోగ్డాన్-డానియెల్‌తో బ్లాక్ పీసెస్‌తో ఆడనున్న ప్రగ్యానందా.. ఆ తర్వాత వరుసగా కారువానా, మాక్సిమ్ వాషియర్-లాగ్రేవ్‌తో తలపడాల్సి ఉంది. చివరి రౌండ్‌లో అనీష్ గిరి ఎదురుకానున్నాడు. ఇక విన్సెంట్ కైమర్ మాత్రం టోర్నీలో ఇప్పటివరకు అత్యుత్తమ ఆటతీరుతో ఆకట్టుకుంటున్నాడు. అతని లైవ్ ర్యాంకింగ్ ప్రపంచ నాలుగో స్థానానికి చేరింది. ఆరో రౌండ్‌లో ఫిరూజ్జాపై గెలిస్తే టైటిల్ రేసులో అతనికి మరింత ఆధిక్యం లభించే అవకాశం ఉంది.
మరోవైపు కారువానా కూడా ఫిరూజ్జాపై విజయంతో టైటిల్ అవకాశాలను బలపరుచుకున్నాడు. తదుపరి మ్యాచ్‌లో అతను సిందరోవ్‌ను ఎదుర్కొననున్నాడు. ఈ పోరులో అనుభవం, వ్యూహాలు కీలకంగా మారనున్నాయి. 10 మంది ఆటగాళ్లతో జరుగుతున్న ఈ తొమ్మిది రౌండ్ల టోర్నీ మొత్తం ప్రైజ్ మనీ 3.75 లక్షల డాలర్లు. ఇందులో విజేతకు లక్ష డాలర్ల బహుమతి ఇవ్వనున్నారు. ఈ ఏడాది గ్రాండ్ చెస్ టూర్‌లో ఇది రెండో టోర్నీ కాగా.. టాప్-4లో నిలిచిన ఆటగాళ్లు ఏడాది చివర్లో జరిగే గ్రాండ్ ఫైనల్‌కు అర్హత సాధిస్తారు.

