కలం, స్పోర్ట్స్: ప్రపంచ టెన్నిస్‌లో (Tennis) ఇప్పుడు రెండు ఆసియా దేశాల పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. ఫిలిప్పీన్స్‌కు చెందిన అలెగ్జాండ్రా ఈలా, ఇండోనేషియా స్టార్ జానిస్ ట్జెన్ (Alexandra Eala-Janice Tjen) తమ ఆటతో మహిళల టెన్నిస్‌లో కొత్త సంచలనం సృష్టిస్తున్నారు. టెన్నిస్ మ్యాప్‌లో పెద్దగా కనిపించని సౌత్ ఈస్ట్ ఆసియాకు ఇప్పుడు ఈ ఇద్దరు యువతులు కొత్త గుర్తింపు తీసుకొస్తున్నారు. 21 ఏళ్లకు చేరువలో ఉన్న ఈలా ఈ ఏడాది జనవరిలో ప్రపంచ టాప్-50లోకి ప్రవేశించిన తొలి ఫిలిప్పీన్స్ మహిళగా చరిత్ర సృష్టించింది. ప్రస్తుతం ఆమె ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 38వ స్థానంలో కొనసాగుతోంది. మరోవైపు ట్జెన్ ఫిబ్రవరిలో టాప్-40లోకి చేరి, దాదాపు మూడు దశాబ్దాల తర్వాత ఆ స్థాయికి చేరిన ఇండోనేషియా మహిళగా నిలిచింది. ఇద్దరూ కొన్నిసార్లు డబుల్స్ పార్ట్నర్స్‌గా ఆడటంతో అభిమానులు వీరికి “SEASters” అనే పేరును పెట్టారు. కోర్టులో వీరి ఆట ఎంత ఆకట్టుకుంటుందో.. స్టాండ్స్‌లో అభిమానుల హంగామా కూడా అంతే హైలైట్ అవుతోంది.
ప్రతి టోర్నీలో ఈలాను చూసేందుకు ఫిలిప్పీన్స్ అభిమానులు భారీ సంఖ్యలో వస్తున్నారు. మొదట్లో తన పాపులారిటీని నమ్మలేకపోయానని, కానీ ఇప్పుడు అభిమానుల ప్రేమను అంగీకరించి ఆస్వాదిస్తున్నానని ఈలా తెలిపింది. అయితే ఈ క్రేజ్ మధ్య కూడా తన ఆట, మానసిక సమతౌల్యంపై ప్రత్యేక దృష్టి పెడుతున్నట్లు చెప్పింది. అమెరికా ఆటగాడు అమాండా అనిసిమోవా కూడా ఈలా ఫ్యాన్ బేస్‌ను ప్రశంసించింది. ఆమె మ్యాచ్‌ల సమయంలో కనిపించే వాతావరణం అద్భుతంగా ఉంటుందని పేర్కొంది. 12 ఏళ్లకే ఇంటిని విడిచి స్పెయిన్‌లోని రఫెల్ నాదల్ అకాడమీలో చేరిన ఈలా.. 2022లో యూఎస్ ఓపెన్ జూనియర్ టైటిల్ గెలిచి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. తర్వాత రిటైర్మెంట్ అనంతరం నాదల్‌తో ప్రాక్టీస్ చేసే అరుదైన అవకాశం కూడా దక్కించుకుంది.
ఇక ట్జెన్ ప్రయాణం పూర్తిగా భిన్నం. అమెరికా యూనివర్సిటీల్లో స్కాలర్‌షిప్‌తో చదువుకుంటూ టెన్నిస్‌లో ఎదిగింది. ఒక దశలో టెన్నిస్ వదిలేయాలని భావించినప్పటికీ, తన చుట్టూ ఉన్నవారి ప్రోత్సాహంతో మళ్లీ కోర్టులోకి వచ్చి ఇప్పుడు ప్రపంచ టెన్నిస్‌లో గుర్తింపు సంపాదిస్తోంది. థాయ్‌లాండ్‌కు చెందిన లాన్‌లానా టరారుడీ, మనంచయా సావంగ్‌కేవ్ వంటి యువ ఆటగాళ్లు కూడా టాప్-100కు చేరువలో ఉండటంతో సౌత్ ఈస్ట్ ఆసియాలో టెన్నిస్ కొత్త దశలోకి అడుగుపెడుతోందనే చర్చ మొదలైంది. ప్రస్తుతం ఈలా, ట్జెన్ ఇద్దరూ తమ దేశాలకు మాత్రమే కాదు.. మొత్తం ఆసియా టెన్నిస్‌కు కొత్త ఆశలుగా మారిపోయారు. రాబోయే గ్రాండ్‌స్లామ్‌ల్లో వీరి ప్రదర్శనపై ఇప్పుడు ప్రపంచ టెన్నిస్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

