కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ జిల్లా నూతన కలెక్టర్ కార్యాలయాన్ని (Karimnagar Collectorate) ఈనెల చివరి వారంలోగా సీఎం రేవంత్ చేతుల మీదగా ప్రారంభిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) స్పష్టం చేశారు. ఈ మేరకు గురువారం కరీంనగర్ కలెక్టరేట్ నూతన భవనం పనులను జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రాతో కలిసి మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా పొన్నం మాట్లాడుతూ.. నూతన భవనంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా ప్రారంభిస్తామని చెప్పారు. కలెక్టర్ ఆవరణలో నివాస గృహాలను తొలగించబోమని స్పష్టం చేశారు. తెలంగాణలోని 33 జిల్లాలో కరీంనగర్ జిల్లా అగ్రస్థానంలో ఉండేలా కృషి చేస్తున్నామని తెలిపారు.
విద్య, వైద్యం, వ్యవసాయంలో ముందుండేలా అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. మానేరు రివర్ ఫ్రంట్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే సెకండ్ బిల్ విడుదల చేసామని.. రివర్ ఫ్రంట్ ని అభివృద్ధిలోకి తీసుకొస్తామని చెప్పారు. తీగల వంతెన లోపభూష్టంగా ఉందని.. అభివృద్ధికి ఆటంకంగా డంప్ యార్డు ఉందని చెప్పారు. డంప్ యార్డును సమస్యను పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వ సహకారము అవసరమని తెలిపారు. జిల్లాలో ఆగిపోయిన పనులను పూర్తి చేస్తామన్నారు. జిల్లా అభివృద్ధి ప్రజా సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా తాము పనిచేస్తున్నామని స్పష్టం చేశారు.
సుడా ఆధ్వర్యంలో కలెక్టరేట్ ప్రాంగణంలో విస్తృత స్థాయిలో గ్రీనరీ, ల్యాండ్‌స్కేపింగ్ అభివృద్ధి పనులు చేపట్టినట్లు మంత్రి తెలిపారు. పర్యావరణ హిత వాతావరణం, విశాలమైన కార్యాలయాలు, ప్రజలకు అందుబాటులో ఉండే సేవా వ్యవస్థతో ఈ కలెక్టరేట్ రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన ప్రభుత్వ కార్యాలయ సముదాయంగా నిలుస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు మరింత సమర్థవంతంగా చేరవేయడంలో నూతన కలెక్టరేట్ కీలక పాత్ర పోషిస్తుందని మంత్రి పేర్కొన్నారు. జిల్లాను పరిశ్రమలు, పర్యాటకం, విద్య, వైద్య రంగాల్లో మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
సహచర మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, స్థానిక ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల సహకారంతో కరీంనగర్‌ను రాష్ట్రంలోనే ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దేందుకు సమష్టిగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. శాతవాహన విశ్వవిద్యాలయం అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, లా కాలేజీ, ఫార్మసీ కాలేజీ ఏర్పాటు ద్వారా ఉన్నత విద్యా అవకాశాలు విస్తరించాయని చెప్పారు. గతంలో నిలిచిపోయిన విద్యా అభివృద్ధి కార్యక్రమాలకు కొత్త ఊపునిస్తూ మరిన్ని కోర్సులు, సౌకర్యాల కల్పనకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.

