కలం, మెదక్ బ్యూరో: ప్రజాస్వామ్యానికి పట్టుగొమ్మలా ఉండాల్సిన కేంద్ర ఎన్నికల సంఘం అధికార బీజేపీకి అనుబంధ సంస్థలా మారిపోయిందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం నకిరికొమ్ముల గ్రామంలో పర్యటించారు. గతంలో ఒక్క అర్హులైన ఓటరు కూడా మిస్ కావొద్దనే ఉద్దేశంతో సవరణలు జరిగేవన్నారు. ప్రస్తుతం ఎన్నికల అధికారులు భయంతో, బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా ఉన్న పేదల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగిస్తున్నారని మండిపడ్డారు.
గెలుపు కోసం కుట్రలు..
కర్ణాటక, బీహార్, బెంగాల్ సహా పలు రాష్ట్రాల్లో ఎన్నికలకు ముందే గెలుపు కోసం ఇలాంటి కుట్రలకు తెరలేపారని మంత్రి పొన్నం ఆరోపించారు. కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజకీయ పార్టీకి అధికార ప్రతినిధిలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఆయన వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారను. కాంగ్రెస్‌తో పాటు ప్రజాస్వామిక పార్టీలన్నీ ఏకమై దేశవ్యాప్తంగా గల్లీ గల్లీలో ‘ఓట్ బచావో – దేశ్ బచావో’ పేరిట ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నట్లు తెలిపారు.

