కేసీఆర్‌కు పట్టిన గతే మోదీకి పడుతుంది.. ఢిల్లీలో పొంగులేటి ఫైర్!

కలం, వెబ్ డెస్క్: ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రతి పౌరుడికి, ప్రతి రాజకీయ పార్టీకి రాజ్యాంగం కల్పించిన హక్కు అని తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి (Ponguleti Srinivasa Reddy) అన్నారు. ఢిల్లీలో జరిగిన ఇండియా కూటమి నిరసన కార్యక్రమంలో పొంగులేటి పాల్గొని మాట్లాడారు. ప్రజల సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లేందుకు నిరసనలు, ధర్నాలు, ఆందోళనలు ప్రజాస్వామ్యంలో సహజమైన ప్రక్రియ అని పేర్కొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలు, రాజకీయ పార్టీలు తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్‌ ధర్నాచౌక్‌ ఒక వేదికగా ఉండేదని మంత్రి గుర్తుచేశారు. అయితే 2014లో అధికారంలోకి వచ్చిన కేసీఆర్‌ ప్రభుత్వం ప్రజల నిరసన హక్కును కాలరాస్తూ ఇందిరాపార్క్‌ వద్ద ధర్నాచౌక్‌ను ఎత్తివేసిందని విమర్శించారు. నిరసన తెలిపే అవకాశం లేకుండా చేసిన కేసీఆర్‌ ప్రభుత్వానికి ప్రజలు ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పారని మంత్రి పేర్కొన్నారు.

కేసీఆర్‌ బాటలో మోదీ

తెలంగాణలో కేసీఆర్‌ అనుసరించిన అదే విధానాన్ని ఇప్పుడు కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం అనుసరిస్తోందని మంత్రి పొంగులేటి విమర్శించారు. దేశ రాజధాని ఢిల్లీలో ప్రజలు, రాజకీయ పార్టీలు తమ సమస్యలపై నిరసన వ్యక్తం చేసేందుకు ఉపయోగించుకున్న జంతర్‌మంతర్‌ లాంటి నిరసన వేదికలపై ఆంక్షలు విధించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమన్నారు. కేసీఆర్‌ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో నిరసన వేదికను తొలగిస్తే.. మోదీ ప్రభుత్వం దేశ రాజధాని ఢిల్లీలో నిరసనలకు ఆంక్షలు విధిస్తోందని, ఇద్దరి ఆలోచనా విధానం ఒక్కటేనని పొంగులేటి మండిపడ్డారు.

ప్రజల గొంతును అణచివేయాలని చూసిన కేసీఆర్‌కు ఎలాంటి రాజకీయ పరిణామం ఎదురైందో.. అదే పరిస్థితి భవిష్యత్‌లో నరేంద్ర మోదీకి కూడా ఎదురవుతుందని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. ఇందిరాపార్క్‌ ధర్నాచౌక్‌ను ఎత్తేసిన కేసీఆర్‌కు పట్టిన గతే.. జంతర్‌మంతర్‌పై ఆంక్షలు విధిస్తున్న మోదీకి పడుతుందన్నారు. ప్రజల గొంతును అణచివేసే ప్రతి పాలకుడికి చివరకు ప్రజల తీర్పే సమాధానం” అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి హెచ్చరించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>