రెండో విడత ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన పొంగులేటి

​కలం, ఖమ్మం బ్యూరో: రాష్ట్రంలో అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivas Reddy) స్పష్టం చేశారు. కుల, మత, పార్టీలకతీతంగా పూర్తిగా పేదల సంక్షేమమే ధ్యేయంగా సంక్షేమ ఫలాలు అందిస్తున్నామని అన్నారు. శుక్రవారం ఖమ్మం జిల్లా ఏదులాపురం (Edulapuram) మున్సిపాలిటీ పరిధిలోని పీవీఆర్ గార్డెన్స్‌లో జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్‌తో కలిసి మున్సిపాలిటీకి చెందిన 176 మంది లబ్ధిదారులకు రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల పట్టాలను మంత్రి పంపిణీ చేశారు.

​ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ.. పేదవాళ్ళు సొంత ఇంటి కల నెరవేర్చుకోవాలనే తపనతో ప్రభుత్వం ముందుకు వెళ్తోందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొదటి విడతలో 4.5 లక్షలు, రెండో విడతలో 2.5 లక్షలు, హైదరాబాద్ కోర్ ఏరియాలో మరో లక్ష ఇళ్లు.. మొత్తంగా రెండు విడతల్లో రూ. 40 వేల కోట్ల వ్యయంతో 8 లక్షల ఇందిరమ్మ ఇళ్లను నిర్మిస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఆడబిడ్డకు రూ. 5 లక్షల ఆర్థిక సహాయంతో ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తున్నట్లు చెప్పారు.

జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ మాట్లాడుతూ.. ఏదులాపురం మున్సిపాలిటీలో మొదటి విడత కింద మంజూరైన 467 ఇళ్లలో దాదాపు 400 ఇళ్ల నిర్మాణం పూర్తై లబ్ధిదారులకు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అత్యంత పారదర్శకంగా ఎంపిక చేపట్టినట్లు చెప్పారు. నిర్మాణం పూర్తయిన ప్రతీ స్టేజీకి సంబంధించిన ఫోటోలను తీసుకుని, కేవలం వారం పది రోజుల్లోనే బిల్లులు చెల్లిస్తుండటంతో లబ్ధిదారులు వేగంగా ఇళ్లను నిర్మించుకోగలుగుతున్నారని వెల్లడించారు. మొదటి విడత విజయవంతమైన నేపథ్యంలో ఇప్పుడు రెండో విడత కింద 176 మందికి పట్టాలు అందజేస్తున్నామని తెలిపారు.

​ఈ కార్యక్రమంలో హౌజింగ్ పీడీ భూక్యా శ్రీనివాస్, ఏదులాపురం మున్సిపల్ చైర్ పర్సన్ పోకబత్తిని అనిత, వైస్ చైర్మన్ తమ్మినేని నవీన్, మున్సిపల్ కమిషనర్ ఆళ్ల శ్రీనివాస రెడ్డి, కౌన్సిలర్లు, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>