కలం, డెస్క్ : క్యూర్ (కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ) పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti) ప్రకటించారు. మార్చి నాటికి ఈ జిల్లాల్లో లబ్దిదారుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేస్తామని తెలిపారు. ఈ మేరకు సచివాలయంలో మంగళవారం మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్ లతో కలిసి మంత్రి పొంగులేటి సమీక్ష నిర్వహించారు. క్యూర్ పరిధిలోని మురికివాడల్లో ఇందిరమ్మ మోడల్ కాలనీలు, ఇందిరమ్మ ఇండ్లకు స్థలాల సేకరణతో పాటు ఇప్పటికీ పూర్తి కాని డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణాలు, పూర్తి అయిన వాటి కేటాయింపు విషయాలపై చర్చించారు.
హైదరాబాద్ సెంటర్ లోని కొన్ని మురికి వాడల్లో నివసిస్తున్న వారికి శివార్లలో ఇండ్లు కట్టి ఇస్తే అక్కడకు వెళ్లేందుకు ఇష్టపడట్లేదని అధికారులు మంత్రుల దృష్టికి తెచ్చారు. వారి జీవనోపాధిని దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోవాల్సిందిగా అధికారులు వెల్లడించారు. హైదరాబాద్ కు దూరంగా 42 వేల ఇండ్లను నిర్మిస్తే ఇప్పటికీ అక్కడ సగం మంది కూడా నివసించట్లేదని.. ఎక్కువగా బోగస్ లబ్దిదారులు ఉన్నట్టు మంత్రులకు అధికారులు తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti) మాట్లాడుతూ.. పేదల జీవనోపాధికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఇండ్లు నిర్మించేందుకు సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామన్నారు. ప్రజల అవసరాల మేరకు 10 అంతస్తుల్లో కూడా ఇందిరమ్మ ఇండ్లు నిర్మించే ఆలోచన చేస్తున్నట్టు తెలిపారు. వచ్చే కేబినెట్ మీటింగ్ లో దీనిపై చర్చించి ఫైనల్ నిర్ణయం తీసుకుంటామని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు.
మూడు కార్పొరేషన్లలో కమిషనర్లు, కలెక్టర్లు చర్చలు జరిపి.. స్థలాలను గుర్తించాలని మంత్రి పొంగులేటి సూచించారు. ఇప్పటి వరకు ఎంత మంది లబ్దిదారులు ఉన్నారు.. వారికి అవసరమైన ఇండ్లు నిర్మించేందుకు ఎంత స్థలం కావాలనే విషయాలపై పూర్తి నివేదిక ఇవ్వాలని మంత్రి ఆదేశించారు. ఇప్పటికే ఇండ్ల స్థలాలు ఉన్న 28 వేల మంది లబ్దిదారులకు ఈ నెల చివరిలోగా ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదేశించారు. శివార్లలో డబుల్ బెడ్ రూం ఇండ్లు తీసుకుని అక్కడ నివసించని వారిని గుర్తించి నోటీసులు ఇవ్వాలన్నారు. బోగస్ లబ్దిదారుల స్థానంలో అర్హులకు అవకాశం కల్పించాలని సూచించారు. అలాగే ఓఆర్ ఆర్-ఆర్ ఆర్ ఆర్ మధ్య అఫర్డబుల్ హౌసింగ్ పాలసీని తెస్తున్నట్టు తెలిపారు. గతంలో కేపీహెచ్ బీలో నిర్మించినట్టుగానే నాలుగు ప్రాంతాల్లో స్థలాలను గుర్తించి ఇండ్లను నిర్మిస్తామని మంత్రి తెలిపారు.


