కలం, వెబ్ డెస్క్: ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అత్యంత నిబద్ధతతో కొనసాగిస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి (Ponguleti Srinivasa Reddy) తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం తొలి దశ పూర్తి పూర్తి చేసుకుంటున్న తరుణంలో లబ్ధిదారులకు మంత్రి గుడ్ న్యూస్ చెప్పారు. జూన్ 2న ఆదిలాబాద్‌లో అధికారికంగా రెండో దశ ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించనున్నట్లు మంత్రి ప్రకటించారు. ఇందుకు సంబందించిన విధివిధానాలను మే 21న జరిగే కేబినెట్ సమావేశంలో చర్చించి ఖరారు చేయనున్నట్లు తెలిపారు. రెవెన్యూ, హౌసింగ్ అంశాలపై ప్రజాప్రతినిధులతో నిర్వహిస్తున్న జిల్లా వారీ సమీక్షలో మంత్రి వివరించారు. మంగళవారం హౌసింగ్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలపై మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, రంగారెడ్డి జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి శ్రీధర్ బాబు, హైదరాబాద్ ఇన్‌చార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్, మంత్రి మొహమ్మద్ అజహరుద్దీన్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కలెక్టర్లు, హౌసింగ్, రెవెన్యూ, అటవీ శాఖల అధికారులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి (Ponguleti) మాట్లాడుతూ.. గత ప్రభుత్వం దూరదృష్టి లేకుండా హైదరాబాద్ నగరానికి చాలా దూరంలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను నిర్మించిందని అన్నారు. దాని ఫలితంగా పేదలు ఉపాధి కోల్పోయే పరిస్థితులు ఏర్పడ్డాయని విమర్శించారు. ఇకపై అలాంటి తప్పిదాలు పునరావృతం కాకుండా, ప్రస్తుతం పేదలు నివసిస్తున్న ప్రాంతాలకు 5 నుంచి 8 కిలోమీటర్ల పరిధిలోనే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూములు గుర్తించాలని అధికారులను ఆదేశించారు. నియోజకవర్గాన్ని యూనిట్‌గా తీసుకుని ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించినట్లు చెప్పారు. ఫీల్డ్ స్థాయి అధికారులు నిర్వహించిన అధ్యయనాల్లో 20 నుంచి 30 కిలోమీటర్ల దూరంలో నిర్మించిన 2 బీహెచ్‌కే ఇళ్లలో నివసించేందుకు లబ్ధిదారులు ఆసక్తి చూపడం లేదని తేలిందన్నారు. దీంతో ప్రభుత్వ భూములు, భూదాన్ భూములు, స్లమ్ ప్రాంతాలు, పాత పథకాల కింద నిర్మించిన శిథిలావస్థలో ఉన్న కాలనీలను గుర్తించి, అదే నియోజకవర్గ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించినట్లు తెలిపారు.
ఇళ్ల కేటాయింపు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలి..
డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కేటాయింపును యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పూర్తయిన ఇళ్లతోపాటు నిర్మాణ దశలో ఉన్న ఇళ్లకు కూడా ఈ నెలాఖరులోగా లబ్ధిదారులను గుర్తించాలని సూచించారు. ప్రభుత్వ భూముల ఆక్రమణపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. ప్రభుత్వ భూములపై ఎలాంటి ఆక్రమణలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. సొంత భవనాలు లేని ఆర్డీవో, తహసీల్దార్, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల కోసం శాశ్వత భవనాల నిర్మాణానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడించారు. రెవెన్యూ, అటవీ శాఖల మధ్య ఉన్న సరిహద్దు వివాదాలను శాశ్వతంగా పరిష్కరించేందుకు రెండు శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
ప్రతి అర్హుడికి ఇందిరమ్మ ఇల్లు..
ప్రతి అర్హుడికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తున్నామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కార్యక్రమాల్లో ఒకటి అని అన్నారు. అర్హతకు పేదరికమే ప్రమాణమని, రాజకీయాలకు ఇందులో స్థానం లేదని స్పష్టం చేశారు. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ.. అసెంబ్లీలో తీసుకున్న నిర్ణయాల మేరకు సమీక్ష సమావేశాలు నిర్వహించడం అభినందనీయని చెప్పారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం అద్భుతంగా అమలవుతోందని, జిల్లా కలెక్టర్లు ప్రతి వారం సమీక్ష నిర్వహించి పేదలకు గరిష్ట ప్రయోజనం చేకూరేలా చూడాలని అన్నారు.
Read Also: తమిళనాడు సీఎం విజయ్ వివాదాస్పద నిర్ణయం !
Follow Us On : WhatsApp

