Mobile Popup Ad
Mobile Popup Ad

త్వరలోనే రెండో విడత ‘ఇందిరమ్మ’ ఇళ్ల మంజూరు: పొంగులేటి

కలం, వెబ్ డెస్క్: తెలంగాణలో మే నెలాఖరు నాటికి రెండో దశ ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivas Reddy) ప్రకటించారు. తమ ప్రభుత్వం ప్రతి సోమవారం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ నిధులను నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తోందని స్పష్టం చేశారు. అధికారులే నేరుగా ప్రజల వద్దకు వచ్చి అర్జీలు స్వీకరించి పరిష్కరించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రజా దర్బార్లలో అత్యధికంగా ఇందిరమ్మ ఇళ్ల కోసమే దరఖాస్తులు వస్తున్నాయని చెప్పారు. ఆదివారం కూసుమంచిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్వహించిన ‘ప్రజా దర్బార్’లో ఆయన పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్, అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజతో కలిసి ప్రజల నుంచి నేరుగా వినతులు స్వీకరించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రజా పాలనను పారదర్శకంగా ప్రజల గడప వద్దకే తీసుకెళ్తున్నామని అన్నారు. ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కార దిశగా తక్షణ చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ​పాలేరు నియోజకవర్గంలో ప్రతి మండలాన్ని క్లస్టర్లుగా విభజించి నిర్వహిస్తున్న ఈ ప్రజా దర్బార్లలో అందిన ప్రతి న్యాయబద్ధమైన దరఖాస్తును రాజకీయ పార్టీలకు అతీతంగా పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. సాదా బైనామా, నిషేధిత జాబితా, భూమి రికార్డుల వంటి దీర్ఘకాలిక సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తోందని మంత్రి తెలిపారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ న్యాయం చేయడమే తమ ప్రభుత్వ బాధ్యతని స్పష్టం చేశారు.

రాష్ట్రంలో ​వడ్లు, మొక్కజొన్న పంటలను మద్దతు ధరకే కొనుగోలు చేస్తున్నామని మంత్రి వివరించారు. వారం రోజుల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికే 25 లక్షల మందికి రుణమాఫీ చేశామని, రైతు భరోసాను ఎకరానికి 12 వేలకు పెంచడంతో పాటు సన్న వడ్లకు క్వింటాల్‌కు రూ. 500 బోనస్ అందిస్తున్నామని చెప్పారు. మే 5 నుంచి 7 వరకు సబ్సిడీపై వ్యవసాయ పనిముట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>