కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ (Karimnagar) లోని జ్యోతినగర్ పీఎంజే జ్యువెలరీ షాపు సిబ్బందిపై దుండగుల కాల్పుల ఘటనపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay Kumar) ఆరా తీశారు. సమాచారం తెలిసిన వెంటనే ఆయన నగర మేయర్ కొలగాని శ్రీనివాస్, స్థానిక కార్పొరేటర్ బోయినిపల్లి ప్రవీణ్ కుమార్ తదితరులతో కలిసి ఘటన స్థలానికి చేరుకున్నారు. జ్యువెలరీ షాపులోని సీసీ పుటేజీని పరిశీలించారు. కాల్పుల ఘటనపై షాపు సిబ్బంది వద్ద ఆరా తీశారు. ఈ ఘటనపై పోలీస్ కమిషనర్, స్థానిక పోలీసులతో మాట్లాడారు.
అనంతరం బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay Kumar) మీడియాతో మాట్లాడుతూ.. ఇది అనుకోని సంఘటన. అత్యంత దురదృష్టకరం అని ఆవేదన వ్యక్తం చేశారు. సీసీ ఫుటేజీ, సిబ్బంది చెప్పిన వివరాలను బట్టి మొత్తం ఐదుగురు దుండుగులు చోరీ చేయడానికి జ్యువెలరీ షాపులోకి వచ్చి కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. ముందుగా ఒక వ్యక్తి వచ్చి 20 గ్రాముల చైన్ కావాలని చూపించమని అడిగారు. కాసేపటి తర్వాత మరో ఇద్దరు వ్యక్తులు వచ్చి గోల్డ్ ఆభరణాలు కొంటాం చూపాలన్నారు. బంగారు ఆభరణాలు చూపిస్తున్న సమయంలో మరో ఇద్దరు వ్యక్తులు వచ్చారు. దుండుగులు తెలుగు, హిందీ భాషలు మాట్లాడుకున్నారు. ఐదుగురు కలిసి తుపాకులు చూపించి బెదిరించి ఆభరాణలను చోరీ చేసేందుకు యత్నించారు. అడ్డుకున్న షాపు సేల్స్ మేనేజర్, ఇతర సిబ్బందిపై కాల్పులు జరిపారు. సిబ్బంది చాలా ధైర్యంగా తెగించి అడ్డుకున్నారు. ఆ క్రమంలోనే వారికి గాయాలు అయ్యాయి.
ఇప్పటి వరకైతే ప్రాణాపాయం ఏమీ లేదని డాక్టర్లు చెబుతున్నారు. అయినప్పటికీ బాధితులను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలిస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటన జరిగే సమయానికంటే 10 నిమిషాల ముందే షాపు సమీపంలోనే అభివృద్ధి పనులను ప్రారంభించే కార్యక్రమంలో పాల్గొన్నట్లు బండి సంజయ్ తెలిపారు. ఘటన జరిగిన వెంటనే నగర పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో పోలీసులు అప్రమత్తమై కరీంనగర్‌ను చుట్టుముట్టారని అన్నారు. పోలీసులు దుండుగులను పట్టుకుంటారనే నమ్మకం ఉందన్నారు. ఏదేమైనా అధికారులు కమాండ్ కంట్రోల్ రూంలోని సీసీ పుటేజీ పరిశీలిస్తున్నారని, క్లూస్ టీం వచ్చిందని తెలిపారు. ఎంత గోల్డ్, ఇతర ఆభరణాలు ఎత్తుకెళ్లారనేది పోలీసుల విచారణలో తేలుతుందని తెలిపారు.

