కలం, వరంగల్ బ్యూరో: వరంగల్‌లో (Warangal) రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి. కొద్ధిరోజుల్లో జరగనున్న గ్రేటర్ వరంగల్ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ప్రధాన పార్టీల్లో జోష్ కనిపిస్తోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు రైతు సమస్యలను అంశంగా చేసుకుని ఒకే వేదికపై సభలు పెట్టి పోటాపోటీగా విమర్శలు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో అభివృద్ధి ప్రధాన అస్రంగా బీజేపీ గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్‌పై కాషాయ జెండా ఎగురవేయాలని కసరత్తు చేస్తోంది. దీంతో వరంగల్ రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి.
ఒకే రోజు రెండు సభలు..
కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సమస్యల పట్ల నిర్లక్ష్య ధోరణి ఆవలంభిస్తోందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ నెల 6న రైతు సంగ్రామ సదస్సు పేరిట సభ నిర్వహిస్తోంది. అయితే 2022లో ఇదే తేదీన కాంగ్రెస్ పార్టీ వరంగల్‌లో రైతు డిక్లరేషన్ పేరిట సభ నిర్వహించిన సభకు రాహుల్ గాంధీ హాజరై రైతుల పలు హామీలు ఇచ్చారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు అయినా రైతులకిచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలం చెందిందంటూ బీఆర్ఎస్ కాంగ్రెస్‌ను ఎండగట్టడమే లక్ష్యంగా సభ నిర్వహిస్తోంది. ఈ సభకు లక్షలాదిగా రైతులను తరలించేలా ముఖ్య నాయకులు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఆయా నియోజకవరర్గాల వారీగా సమావేశాలు నిర్వహిస్తూ స్థానిక నాయకులను సమన్వయం చేస్తున్నారు. ఈ సభకు చీఫ్ గెస్ట్‌గా కేటీఆర్ హాజరవుతున్నారు. మాజీ సీఎం కేసీఆర్ సైతం వచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నెల 5,6,7 తేదీల్లో హనుమకొండలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో రైతు మేళాకు ఏర్పాట్లు చేపట్టింది. ఇప్పటికే జిల్లా అధికార యంత్రాంగం మేళా సక్సెస్ కోసం వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. పెద్ద సంఖ్యలో రైతులు హాజరయ్యేలా అధికారులు సమన్వయం చేసుకుంటున్నారు. ఈ మేళాను ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టారు. దీనికి తోడు వరంగల్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన హామీలు, చేసిన అక్రమాలను ఎండగడుతున్నారు. కాజీపేట రైల్వే అభివృద్ధిని పట్టించుకోలేదని, వరంగల్‌కు ఏటా రూ. 300 కోట్లు ఇస్తానన్న హామీని నిలబెట్టుకోలేదని విమర్శలు గుప్పిస్తున్నారు.
గ్రేటర్ పై బీజేపీ ఫోకస్..
రైతు అంశాలే ప్రధాన అజెండాగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు తలపడుతుండగా బీజేపీ పార్టీ అభివృద్ధి మంత్రంగా వరంగల్ మున్సిపల్ ఎన్నికలపై ఫోకస్ పెట్టింది. ఈసారి మేయర్ పీఠం దక్కించుకునేందుకు వ్యూహాలు రూపొందిస్తోంది. మామునూర్ లో ఎయిర్ పోర్ట్ నిర్మాణ పనులు ప్రారంభం అయిన నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఇక్కడికి రప్పించి శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించాలని తద్వారా మున్సిపల్ ఎన్నికల్లో కాషాయ జెండా ఎగురవేయాలని ఊవ్విళ్లూరుతున్నారు. అదే విధంగా వరంగల్ కు స్మార్ట్ సిటీ కింద నిధులు, కాజిపేట్‌లో వ్యాగన్ పరిశ్రమ, టెక్స్ట్ టైల్స్ పార్క్, తదితర అంశాలను ప్రధాని నోటి వెంట ప్రజలకు వివరించి లబ్ధి పొందాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో వరంగల్ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి.

