Mobile Popup Ad
Mobile Popup Ad

పాలమూరులో బీజేపీ బలహీనపడుతోందా?.. రాజకీయ వర్గాల్లో చర్చ!

కలం, మహబూబ్ నగర్ బ్యూరో: పాలమూరు (Palamuru) లోకసభ నియోజకవర్గంలో బీజేపీ బలహీన పడుతోందా? ఈ లోకసభ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో కేంద్ర నిధులు పైసా విధిలించలేదా? బీజేపీ శ్రేణులు కూడా ఉత్సాహాన్ని కోల్పోయారా? అని అంటే అన్నింటికీ సమాధానం అవుననే వినిపిస్తోంది. ఈ లోకసభ నియోజకవర్గం పరిధిలో ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కొడంగల్ కూడా ఉంది. ఈ నియోజకవర్గంలో ఇటీవల ముఖ్యమంత్రి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసి రాష్ట్రంలోనే ఉత్తమ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ (MP DK Aruna) మాత్రం అభివృద్ధి పనులు చేయడంలో వెనుకబడి ఉన్నారనే నింద మోస్తున్నారు. పార్లమెంట్ నియోజకవర్గంలోని మిగతా 6 అసెంబ్లీ నియోజకవర్గాలు మహబూబ్ నగర్, దేవరకద్ర, మక్తల్, నారాయణ పేట, జడ్చర్ల, షాద్ నగర్ ఈ లోకసభ పరిధిలో ఉన్నాయి. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ఏడు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ విజయ కేతనం ఎగురవేసింది. ఏడుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలుపొందినా 2024 లోకసభ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. ఈ నియోజకవర్గం ప్రజలు ఆరు నెలల్లో కాంగ్రెస్ పార్టీని కాదని బీజేపీకి పట్టం కట్టారు.

అప్పట్లో ఈ ఏడుగురు ఎమ్మెల్యేల పై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జడ్చర్ల, షాద్ నగర్, కొడంగల్ నియోజకవర్గాల్లో మాత్రమే కాంగ్రెస్ పార్టీకి కొంత అధిక్యం వచ్చింది. మిగతా నాలుగు నియోజకవర్గాల్లో బీజేపీ మెజారిటీ సాధించింది. నారాయణ పేట అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీకి 19 వేల పైనే మెజారిటీ వచ్చింది. మొత్తంగా చూస్తే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వంశీ చంద్ రెడ్డి పై 4,499 ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి డీకే అరుణ గెలుపొందారు. ఏడుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నా బీజేపీ అభ్యర్థి డీకే అరుణ గెలిచి సంచలనం సృష్టించింది. కేవలం ఈ లోకసభ నియోజకవర్గంలో నాలుగు సార్లు ప్రచారం నిర్వహించారు. అయినా ఫలితం రాకపోవడంతో ఇక్కడి ఎమ్మెల్యేల తీరుపై సీఎం మండిపడ్డారు. వంశీ చంద్ రెడ్డికి ఏఐసీసీతో పాటు రాహుల్ గాంధీతో స్నేహ సంబంధాలు ఉండడంతో ఆయన ఇక్కడ ఎంపీగా గెలిస్తే తమ ఉనికి పోతుందనే భయంతో ఎమ్మెల్యేలు లోలోపల బీజేపీకి మద్దతు ఇచ్చారనే ఆరోపణలు మెండుగా వచ్చాయి. బీజేపీ నుంచి ఎంపీగా గెలిచిన డీకే అరుణ ఈ ఏడు నియోజకవర్గాల్లో ఒక్క అభివృద్ధి పనులు చేయలేదనే ఆరోపణలు మూటగట్టుకున్నారు.

కేవలం పర్యటనలకే పరిమితం అయ్యారు కానీ అభివృద్ధి కోసం కేంద్రం నుంచి ఒక్క పైసా కూడా తీసుకు రాలేదని , పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించడంలో కూడా డీకే అరుణ చొరవ చూపలేదని విమర్శలు వినబడుతున్నాయి. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఎంపీ డీకే అరుణ ఒక్కరే ఈ ఏడు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఒక్క నారాయణ పేట మున్సిపాలిటీలో మాత్రమే బీజేపీ విజయం పొందింది. అదికూడా ఎంపీ ఎక్స్ అఫిషియో ఓటుతో బీజేపీ గట్టెక్కింది. ఎంపీ ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో భారీ మెజారిటీ సాధించిన బీజేపీ మున్సిపాలిటీ ఎన్నికల్లో ఓటమి అంచు నుంచి కాస్త బయటపడింది. ఈ ఏడు నియోజకవర్గాల్లో గత పది నెలల్లో బీజేపీ ప్రభావం పూర్తి గా పడిపోయింది. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎంపీని పట్టించుకోవడం లేదనే విమర్శలు లేకపోలేదు. ఎంపీ డీకే అరుణ కూడా ఈ నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలను పట్టించుకోకుండా పర్యటన చేస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. ఎమ్మెల్యేలు కూడా ప్రభుత్వ కార్యక్రమాలకు ఎంపీకి సమాచారం ఇవ్వడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఎంపీతో కలిసి అభివృద్ధి పనుల్లో పాల్గొనేందుకు ఎమ్మెల్యే సుముకంగా లేరనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఏది ఏమైనా రోజు రోజుకు బీజేపీ ప్రాభావం తగ్గిపోతోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>