కలం, కరీంనగర్ బ్యూరో: “కోట్ల రూపాయల ఆదాయం కలిగిన దేవస్థానానికి గోదావరి మాతకు ఒక చీర సమర్పించే నిధులు కూడా లేవా? చివరకు దేవతామూర్తులను సైతం రాజకీయ ప్రచారానికి వాడుకుంటారా?” అంటూ బీఆర్ఎస్ నాయకులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. జగిత్యాల జిల్లాలోని ధర్మపురిలో పవిత్ర గోదావరి మాత విగ్రహానికి ‘ఇందిరమ్మ చీర’ అలంకరించడంపై వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. గోదావరి మాత ఆలయాన్ని(Godavari Mata Temple) సందర్శించిన అనంతరం మాజీ డీసీఎంఎస్ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి, మండల కన్వీనర్ అయ్యోరి రాజేష్ కుమార్ మీడియాతో మాట్లాడారు. సంప్రదాయం ప్రకారం పూజారులు చేయాల్సిన అలంకరణను ఇతర సిబ్బందితో చేయించడం వెనుక ఆంతర్యమేమిటని నిలదీశారు. రాజకీయ నాయకుల మెప్పు కోసం ఆలయ అధికారులు నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని ఆరోపిస్తూ, ఈ ఘటనపై ఆలయ ఈవో భక్తులకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
మహిళా భక్తుల ఇబ్బందులపై ఆవేదన
కార్తీక మాసంలో వేలాది మంది భక్తులు తరలివస్తున్నా కనీస సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం, అధికారులు విఫలమయ్యారని బీఆర్ఎస్ నేతలు విమర్శించారు. మహిళా భక్తులు దుస్తులు మార్చుకోవడానికి తాత్కాలిక షెడ్లు లేకపోవడం, పది రోజులుగా బాత్రూమ్ల వద్ద మోటార్ పనిచేయకపోవడం మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘స్వచ్ఛ గోదావరి’ ప్రకటనలకే పరిమితమైందని, తీరమంతా చెత్తాచెదారంతో అపరిశుభ్రంగా మారిందని పేర్కొన్నారు.
కార్తీక పౌర్ణమి ఏర్పాట్లే చేయలేని అధికారులు, రాబోయే గోదావరి పుష్కరాలను ఎలా నిర్వహిస్తారని వారు ప్రశ్నించారు. ఈ ఘటనపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తక్షణమే స్పందించి విచారణ జరిపించాలని, బాధ్యులపై చర్యలు తీసుకుని ఆలయ పవిత్రతను కాపాడాలని బీఆర్ఎస్ శ్రేణులు డిమాండ్ చేశాయి. ఈ కార్యక్రమంలో పట్టణ కన్వీనర్ బండారి రంజిత్, సీనియర్ నాయకులు సంగి శేఖర్, చిలువేరి శ్యామ్ సుందర్, పెరుమాండ్ల ఎల్లగౌడ్ తదితరులు పాల్గొన్నారు.

