కలం, వెబ్ డెస్క్: ఏపీలో ఫ్లెక్సీ రాజకీయం దుమారం రేపుతోంది. రాజకీయ పార్టీలు ఒకరిపై ఒకరు చేసుకునే ఆరోపణలను ఫ్లెక్సీల రూపంలో రోడ్లపై ప్రదర్శించడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. ఇటీవల తిరుమల లడ్డూ వ్యవహారంలో కల్తీ నెయ్యిపై కూటమి నేతలు పలువురు రోడ్లపై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు అలజడి సృష్టించాయి. దీనిపై వైసీపీ శ్రేణులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో పలుచోట్ల ఘర్షణలు జరిగాయి. ఈ నేపథ్యంలో ఏలూరు(Eluru)లో వివాదాస్పద ఫ్లెక్సీలపై పోలీసులు(Police) ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్లపై ఎలాంటి ఫ్లెక్సీలు ఏర్పాటు చేయరాదని ఆదేశాలు జారీ చేశారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలతో బ్యానర్లు, పోస్టర్లు, ఫ్లెక్సీలు ప్రింట్ చేయొద్దని నిర్వాహకులకు సూచించారు. ఈ మేరకు జంగారెడ్డిగూడెం, చింతలపూడిలో నిర్వాహకులకు నోటీసులు కూడా జారీ చేశారు. రోడ్లపై పలు చోట్ల ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించే ప్రక్రియ మొదలుపెట్టారు.


