భద్రాద్రి‌లో పోలీసుల ‘నాకాబందీ’.. 3,714 వాహనాలు తనిఖీ!

​కలం, ఖమ్మం బ్యూరో: అసాంఘిక కార్యకలాపాల అణచివేత, నేరాల నివారణ, రోడ్డు భద్రతే లక్ష్యంగా భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లావ్యాప్తంగా పోలీసులు గురువారం ‘నాకాబందీ’ నిర్వహించారు. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలోని ప్రధాన రహదారులు, కూడళ్లలో ఈ తనిఖీలు చేపట్టారు. గంజాయి అక్రమ రవాణా అడ్డుకట్టతోపాటు పాత నేరస్తులను గుర్తించేందుకు డిజిటల్ ఫింగర్ ప్రింట్ డివైజ్ పరికరాలను ఉపయోగించారు.

​ఈ తనిఖీల్లో మొత్తం 3,714 వాహనాలను పరిశీలించగా, లైసెన్స్ లేని 510 మంది, హెల్మెట్ ధరించని 524 మంది, సీట్ బెల్ట్ లేని 106 మంది, నిబంధనలు ఉల్లంఘించిన 308 వాహనదారులపై చర్యలు తీసుకున్నారు. 7 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేశారు. ఒక చోరీ బైక్ సహా 15 అనుమతి లేని వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నిబంధనలు పాటించని 1,567 వాహనాల నుండి జరిమానా వసూలు చేశారు. ​ఈ సందర్భంగా ఎస్పీ రోహిత్ రాజు మాట్లాడారు. ప్రతిఒక్కరూ హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించి వాహనాలు నడపాలని, మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని హెచ్చరించారు. ప్రజల రక్షణ కోసం ఇలాంటి నాకాబందీలు నిరంతరం కొనసాగుతాయని తెలిపారు.

భారీగా గంజాయి స్వాధీనం – ఐదుగురు అరెస్ట్

ఖమ్మం జిల్లా కల్లూరు పట్టణ శివారులో అక్రమంగా గంజాయి విక్రయాలు జరుపుతున్న ఐదుగురు సభ్యుల ముఠాను కల్లూరు పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుండి సుమారు రూ. 11.55 లక్షల విలువ కలిగిన గంజాయి, ఒక ఆటో రిక్షా, రెండు ద్విచక్ర వాహనాలు, 5 మొబైల్ ఫోన్లు, రూ. 5 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు గురువారం కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్ వెల్లడించారు. ​ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఈనెల 22 కల్లూరు శివారులోని కాశ్మీర శివాలయం ఖాళీ ప్రాంగణంలో ఆటో, బైక్‌లపై కొందరు అనుమానాస్పదంగా కనిపించారు. పోలీసు వాహనాన్ని చూసి వారు పారిపోవడానికి ప్రయత్నించారు. సిబ్బంది వెంటనే స్పందించి వారిని వెంబడించి ఐదుగురిని పట్టుకోవడంతో గంజాయి లభ్యమైంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>