కలం, ఖమ్మం బ్యూరో: తెలంగాణ ఆధ్యాత్మిక రాజధాని, భక్తజన హృదయ నేత రామయ్య కొలువైన దక్షిణ అయోధ్య భద్రాచలం (Bhadrachalam) పుణ్యక్షేత్రం ప్రస్తుతం తీవ్ర అస్తిత్వ పోరాటాన్ని ఎదుర్కొంటోంది. ఒక వైపు వర్షాకాలం సమీపిస్తుండటం, మరో వైపు పోలవరం పూర్తి కావస్తున్న నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ రూపంలో పొంచి ఉన్న ముప్పు భద్రాద్రి మనుగడను ప్రశ్నార్థకం చేస్తుంది. పోలవరం ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండితే, వెనక్కి తన్నే నీటి వల్ల భద్రాచలం పట్టణ ఉనికికే శాశ్వత ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని భౌగోళిక, సాంకేతిక నిపుణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
జలసమాధి అయ్యే భయానక పరిస్థితులు..
ప్రాజెక్టు పూర్తిస్థాయి ఎఫ్‌ఆర్‌ఎల్ నీటి మట్టానికి చేరినప్పుడు, భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం సాధారణ రోజుల్లో కూడా దాదాపు 45.5 అడుగుల వద్ద స్థిరంగా ఉండే పరిస్థితి నెలకొంటుందని ఇంజనీరింగ్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. అంటే పట్టణం ఏడాది పొడవునా మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయిలోనే కొట్టుమిట్టాడాల్సి వస్తుంది. నదిలో నిరంతరం ఇంత భారీ స్థాయిలో నీరు నిలిచి ఉండటం వల్ల, భద్రాచలాన్ని రక్షిస్తున్న కరకట్టల పునాదులు నిరంతరం నాని బలహీనపడే ప్రమాదం లేకపోలేదు. కాలక్రమేణా ఇవి కోతకు గురైతే, వరద సమయాల్లో కరకట్ట తెగి పట్టణం మొత్తం జలసమాధి అయ్యే భయానక పరిస్థితులు తలెత్తవచ్చునని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఈ బ్యాక్ వాటర్ ముప్పు కేవలం నది ఒడ్డుకే పరిమితం కాకుండా పట్టణాన్ని లోపలి నుంచే ముంచెత్తేలా చేసే అవకాశం కూడా ఉండడం గమనార్హం. ఎలాగంటే భద్రాచలం పట్టణంలోని వర్షపు నీరు, మురుగునీరు గోదావరి నదిలోకి వెళ్లేందుకు ఎనిమిది ప్రధాన తూములు ఉన్నాయి. నదిలో నీటి మట్టం ఎల్లప్పుడూ ఎక్కువగా ఉండటం వల్ల ఈ తూములు సహజంగానే మూసుకుపోతాయి. ఫలితంగా భారీ వర్షాలు కురిసినప్పుడు పట్టణంలోని మురుగునీరు నదిలోకి వెళ్లే మార్గం లేక వెనక్కి తన్ని, అంతర్గతంగానే నివాస ప్రాంతాలను ముంచెత్తుతుందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
ఇసుక మేటలు జారిపోయే అవకాశం..
1986లో 75.6 అడుగులు, 2022లో 71 అడుగుల మేర నమోదైన చారిత్రక మహా ప్రళయాలు తాత్కాలికంగా వచ్చి వెళ్లినవే అయినా లోతట్టు ప్రాంతాలను అతలాకుతలం చేశాయి. ఇప్పుడు పోలవరం ప్రభావంతో శాశ్వతంగా నీరు నిలిచి ఉంటే ఆ నష్టం ఊహకందని విధంగా ఉండబోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మరోవైపు, గోదావరి నది పైకి ప్రశాంతంగా కనిపిస్తున్నప్పటికీ లోపలి స్వభావం ప్రమాదకరంగా మారుతోంది. ఎందుకంటే అక్రమ ఇసుక తవ్వకాల వల్ల ఏర్పడిన భారీ గుంతల కారణంగా ఇసుక మేటలు జారిపోయి ప్రాణాంతకంగా మారుతున్నాయి. ఇటీవలి కాలంలో(మార్చి 20) ఐదుగురు బి.టెక్ విద్యార్థులు గల్లంతైన ఘటనే దీనికి సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది.
అలాగే 2027 జూన్ లో గోదావరి పుష్కరాలు జరగనున్న నేపథ్యంలో, భద్రాచలానికి సుమారు కోటి మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. కావున ప్రభుత్వం తక్షణమే రక్షణ చర్యలు చేపట్టాలని సారపాక కు చెందిన రామ భక్తుడు సురేందర్ డిమాండ్ చేస్తున్నారు. అలాగే ప్రమాదకరంగా మారిన స్నానఘట్టాల పరిసరాలైన పాతాళగంగ, సుబ్బారాంపేట, మల్లెపల్లి ప్రాంతాలను ప్రమాదకర వలయాలుగా ప్రకటించి పటిష్టమైన రక్షణ గోడలు నిర్మించాల్సిన అవసరం ఉందనీ ఆయన సూచిస్తున్నారు.
శాశ్వత ఎత్తిపోతల వ్యవస్థను రూపొందించాలి..
వీటితో పాటు మురుగునీటి తూములు మూసుకుపోయినప్పుడు, పట్టణంలోకి నీరు రాకుండా శాశ్వత ప్రాతిపదికన హై-కెపాసిటీ మోటార్ పంపులను ఏర్పాటు చేసి ఆ నీటిని నదిలోకి పంపించేలా శాశ్వత ఎత్తిపోతల వ్యవస్థను రూపొందించాలని పరిసర ప్రాంతాల ప్రజలు కోరుతున్నారు. నదీ తీరంలో నిరంతరం నిఘా ఉంచేందుకు శిక్షణ పొందిన గజ ఈతగాళ్లను నియమించడం, లోతు వివరాలను తెలిపే హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయడం తక్షణ కర్తవ్యం. ఇప్పటికైనా ప్రభుత్వం, అధికార యంత్రాంగం మేల్కొని ఆలయ అభివృద్ధి కోసం మంజూరైన రూ.351 కోట్లను ఉపయోగించుకొని, యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేయకపోతే భవిష్యత్తులో భద్రాద్రికి భారీ నష్టం తప్పదని పట్టణ ప్రజలు పేర్కొంటున్నారు.

