కలం, వెబ్ డెస్క్ : పరిపాలనా ప్రస్థానంలో ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) 25 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకున్నారు. 2001 అక్టోబర్ 7న గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి నేటి వరకు నిరంతరాయంగా ఆయన ప్రజాప్రభుత్వ అధినేతగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా దిల్లీలోని ఇందిరా గాంధీ స్టేడియంలో బిజెపి ఆధ్వర్యంలో ‘సేవా సంకల్ప్ అభియాన్’ కింద ‘వికసిత్ భారత్ సంకల్ప్ సభ’ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రులు, బిజెపి సీనియర్ నాయకులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా వికసిత్ భారత్ సంకల్ప్ సభను ఉద్దేశించి ప్రధాని మాట్లాడారు. 2001లో గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు ఈ స్థాయికి చేరుకుంటానని అనుకోలేదని, ప్రజల నిరంతర ఆశీస్సుల వల్లనే ఇది సాధ్యమైందని ఆయన వ్యాఖ్యానించారు. 25 ఏళ్ల పాలనా ప్రయాణంలో ప్రజాసేవే పరమావధిగా సాగానని స్పష్టం చేశారు. బిజెపి వర్గాలు ఆయన దూరదృష్టి, ప్రజా సంక్షేమ పథకాలను కొనియాడుతూ ప్రత్యేక తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఆమోదించాయి. రాబోయే కాలంలో ‘వికసిత్ భారత్ 2047’ లక్ష్య సాధనే కేంద్ర ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్యత అని ఈ సభ వేదికగా స్పష్టం చేశారు.

