కలం, కరీంనగర్ : కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా నిరుద్యోగ యువత ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని, ప్రభుత్వ శాఖల్లో పెండింగ్లో ఉన్న బ్యాక్లాగ్ పోస్టులను వెంటనే విడుదల చేసి, అన్ని శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని తెలంగాణ జనతా పార్టీ (TJP)రాష్ట్ర అధ్యక్షులు కుతాడి శివరాజ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
శనివారం కరీంనగర్లోని టిజేపి రాష్ట్ర కార్యాలయంలో పార్టీ ఆధ్వర్యంలో నిరుద్యోగుల సమస్యలపై నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎంతోమంది నిరుద్యోగ యువత సంవత్సరాల తరబడి ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారని, నోటిఫికేషన్లు, ఉద్యోగ భర్తీ ప్రక్రియలో జాప్యం కారణంగా యువత తీవ్ర నిరాశకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ప్రభుత్వ శాఖల వారీగా ఖాళీగా ఉన్న పోస్టులను గుర్తించి, బ్యాక్లాగ్ పోస్టులతో పాటు అన్ని ఖాళీలను తక్షణమే భర్తీ చేయాలని కోరారు. అర్హత కలిగిన నిరుద్యోగులకు వయోపరిమితి విషయంలో తగిన న్యాయం చేయాలని, ఉద్యోగ నియామక ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరారు. నిరుద్యోగ యువతకు కేవలం హామీలు కాకుండా ఆచరణలో ఉద్యోగ అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు.
ఉద్యోగాలు వచ్చే వరకు నిరుద్యోగ యువతను ఆదుకునేందుకు తగిన ఆర్థిక సహాయం అందించాలని సూచించారు. తెలంగాణ జనతా పార్టీ నిరుద్యోగ యువత పక్షాన నిలబడి వారి న్యాయమైన హక్కుల సాధన కోసం నిరంతరం పోరాటం చేస్తుందని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
ప్రభుత్వానికి తెలంగాణ జనతా పార్టీ ప్రధాన డిమాండ్లు:
1. రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్లో ఉన్న బ్యాక్లాగ్ పోస్టులను వెంటనే విడుదల చేయాలి.
2. కరీంనగర్ జిల్లాతో పాటు అన్ని జిల్లాల్లో అన్ని ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలి.
3. శాఖల వారీగా ఉద్యోగ ఖాళీల వివరాలను బహిరంగంగా ప్రకటించాలి.
4. నిరుద్యోగులకు న్యాయం జరిగేలా పారదర్శకంగా నియామకాలు చేపట్టాలి.
5. ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా అండగా నిలవాలి.
ఈ సదస్సు కార్యక్రమంలో తెలంగాణ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు మొగురం మిరియా, కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు కాశిపాక అజయ్, జిల్లా ఉపాధ్యక్షుడు బెజ్జంకి అంజయ్య, మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు పెద్దల చంద్రకాంత్, వరంగల్ జిల్లా ఇన్చార్జి ముత్యం అశోక్ రెడ్డి, రాజన్న సిరిసిల్ల జిల్లా ఇంచార్జి కే నారాయణ రావు, పెద్దపల్లి జిల్లా ఇన్చార్జి రామ్ రమేష్, కొమురయ్య ముదిరాజ్, తడి గొప్పల వినోద్ కుమార్, శ్రీనివాస్, ఉపేందర్, లక్ష్మణ్ రాజ, ఎం మల్లేశం, తదితరులు పాల్గొన్నారు.

