కలం, వెబ్ డెస్క్: ప్రపంచ వ్యాప్తంగా విపత్కర పరిస్థితులు నెలకొన్నా ఆ ప్రభావం భారతదేశంపై మాత్రం పెద్దగా పడలేదని ప్రధాని మోదీ (PM Modi) పేర్కొన్నారు. ఇండియా వృద్ధి ప్రపంచానికే స్ఫూర్తిగా నిలిచిందన్నారు. నీతి ఆయోగ్ 11వ పాలక మండలి సమావేశంలో ప్రధాని అనేక కీలక అంశాలను 28 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అయిదు రాష్ట్రాల లెఫ్టినెంట్ గవర్నర్లకు వివరించారు. ఈ మేరకు నీతి ఆయోగ్ అధికారిక ప్రకటన చేసింది. అన్ని రాష్ట్రాలు ఇక నుంచి స్వయం సమృద్ధి మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కోరారు. మరీ ముఖ్యంగా ఇంధన వనరుల రంగంలో ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న మార్పులు, నూతన ఆవిష్కరణలను అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. కేంద్ర, రాష్ట్రాలు కలిసి పనిచేస్తేనే దేశం అనుకున్న రీతిలో ముందుకు సాగుతుందని కుండబద్దలు కొట్టారు. వికసిత్ భారత్ లక్ష్యంలో ప్రతి రాష్ట్రం, ప్రతి జిల్లా, ప్రతి గ్రామం భాగస్వామ్యం అయితేనే సాధ్యమవుతుందని స్పష్టం చేశారు.

