ఆరుగురు విద్యార్థుల మృతి.. మంత్రి పొన్నం దిగ్భ్రాంతి

కలం, వెబ్ డెస్క్: సంగారెడ్డి జిల్లాలో ఆరుగురు విద్యార్థుల మృతి చెందిన ఘటనపై మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విద్యార్థుల మృతి తనను తీవ్రంగా కలిచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషాద ఘటనలో చిన్నారులను కోల్పోయిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఘటనకు సంబంధించిన వివరాలను జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీతో మంత్రి ఫోన్‌లో మాట్లాడి అడిగి తెలుసుకున్నారు. సహాయక చర్యలు, ఘటనకు సంబంధించిన పరిస్థితులపై ఆరా తీశారు.

రాష్ట్రవ్యాప్తంగా గణేష్ నిమజ్జనాలు జరుగుతున్న నేపథ్యంలో అధికారులు, పోలీసులు మరింత అప్రమత్తంగా ఉండాలని మంత్రి పొన్నం సూచించారు. నిమజ్జన ప్రాంతాల్లో పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు చేయాలన్నారు. ముఖ్యంగా పిల్లలు, విద్యార్థులు నీటిలోకి వెళ్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసు, రెవెన్యూ తదితర శాఖల అధికారులను ఆదేశించారు.

నిమజ్జన ప్రాంతాల్లో ప్రమాదకరమైన లోతైన ప్రాంతాలను గుర్తించి ప్రజలు అక్కడికి వెళ్లకుండా అవసరమైన భద్రతా చర్యలు చేపట్టాలని మంత్రి సూచించారు. గజ ఈతగాళ్లు, రక్షణ సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. తల్లిదండ్రులు కూడా గణేష్ నిమజ్జనాల సమయంలో తమ పిల్లలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. పిల్లలు చెరువులు, కాలువలు, ఇతర నీటి వనరుల వైపు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

కాగా, కాసేపటిక్రితమే పటాన్‌చెరు మండలం పెద్దకంజర్ల గ్రామ శివారులో గణేష్ నిమజ్జనం సందర్భంగా శిరీష చారిటబుల్ ట్రస్టుకు చెందిన ఆరుగురు విద్యార్థులు మృతి చెందిన విషయం తెలిసిందే.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>