కలం, మెదక్ బ్యూరో: తెలంగాణను సస్యశ్యామలం చేసిన కేసీఆర్ పాలనకు, నీటి కాలువల్లో తుమ్మ చెట్లు మొలిచేలా చేస్తున్న కాంగ్రెస్ పాలనకు ఎంతో తేడా ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) విమర్శించారు. మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం రెడ్డిపల్లి వద్ద నిలిచిపోయిన మల్లన్న సాగర్, కాళేశ్వరం కాలువ పనులను నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డితో కలిసి పరిశీలించారు. కాలువల్లో మొలిచిన తుమ్మ చెట్ల వద్ద నిలబడి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సెల్ఫీ ఛాలెంజ్ విసిరారు.
రూ.50 కోట్లు ఇస్తే చాలు..
ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. మల్లన్న సాగర్ నుంచి నర్సాపూర్, ఆందోల్, సంగారెడ్డి నియోజకవర్గాలకు సాగునీరు అందించేందుకు కేసీఆర్ ప్రణాళికలు రూపొందించారని గుర్తు చేశారు. చిన్న లిఫ్ట్ ద్వారా సింగూరులో గోదావరి నీరు నింపాలని భావించారని.. బీఆర్ఎస్ హయాంలోనే 18 కిలోమీటర్ల టన్నెల్ పనుల్లో 85 శాతం పూర్తయినట్లు వివరించారు. కేవలం 300 మీటర్ల పని మాత్రమే మిగిలి ఉందని తెలిపారు. అది పూర్తి చేస్తే గోదావరి జలాలు హల్దీ వాగు ద్వారా నిజాంసాగర్ వరకు చేరి.. మెదక్, నిజామాబాద్ జిల్లాల రైతులకు మేలు జరుగుతుందన్నారు. పిల్ల కాలువలు తవ్వడానికి రూ. 50 కోట్లు కేటాయిస్తే 50 వేల ఎకరాలకు నీళ్లు వస్తాయన్నారు. కానీ ప్రభుత్వం ఆ నిధులు ఇవ్వడానికి కూడా ఆలోచిస్తోందని మండిపడ్డారు.
ఒక్క రూపాయి విడుదల చేయలేదు..
ఉమ్మడి మెదక్ జిల్లా ప్రాజెక్టులపై కాంగ్రెస్ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని హరీశ్ రావు విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో ఉమ్మడి జిల్లాలో ఒక్క గజం కాలువ తవ్వలేదన్నారు. ఒక్క రూపాయి నిధులు విడుదల చేయలేదని ఆరోపించారు. సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్టుల పనులను తక్షణమే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. అలాగే, ఘనపురం ఆనకట్ట ఎత్తు పెంపు పనులను వెంటనే పూర్తి చేయాలన్నారు. మల్లన్న సాగర్ నుంచి నర్సాపూర్, ఆందోల్ నీటిని తెచ్చే కాళేశ్వరం కాలువ పనులు పూర్తి చేయాలన్నారు. సెల్ఫీ తీసి ముఖ్యమంత్రికి ట్యాగ్ చేస్తున్నానని.. ఇప్పటికైనా కళ్లు తెరిచి పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.

