కలం, పెద్దపల్లి: రైతుల సంక్షేమం కోసం ప్రజాప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తోందని ప్రభుత్వ విప్, పెద్దపల్లి శాసనసభ్యులు శ్రీ చింతకుంట విజయరమణ రావు (MLA Vijaya Ramana Rao) తెలిపారు. ఎలిగేడు మండల కేంద్రంలోని మధుర ఫంక్షన్ హాల్లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (PACS) అధ్యక్షుడు సమా రాజేశ్వర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన 137వ సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన పాలకవర్గ సభ్యులను అభినందించారు. అంతకుముందు దివంగత పాత్రికేయులు టీవీ9, సిటీకేబుల్ విలేఖరి టీకే రమేష్ మృతికి సంతాపం తెలిపారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ… సూపర్ ఎల్ నినో ప్రభావం వల్ల వర్షాలు తగ్గే అవకాశం ఉన్నందున రైతులు ఆరుతడి పంటలపై దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. ఖరీఫ్‌లో పంటలను కాపాడేందుకు అవసరమైన మేరకు ఎస్సారెస్పీ ద్వారా నీరు అందిస్తామని హామీ ఇచ్చారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ధరణి పేరుతో భూదోపిడీ జరిగిందని, 22A భూములపై అప్పటి నాయకులు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. కాళేశ్వరం నీళ్లు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చుక్క కూడా రాలేదని, వచ్చినట్లు నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తానని సవాల్ విసిరారు.
సమావేశం అనంతరం ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా ఎలిగేడులో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్, సింగిల్ విండో చైర్మన్లు, డైరెక్టర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

