కలం, కరీంనగర్ బ్యూరో : రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి జోన్ పోలీసుల ఆధ్వర్యంలో పెద్దపల్లి పట్టణంలోని నందన గార్డెన్స్‌లో నిషా ముక్త్ భారత్, ఆపరేషన్ పరివర్తన కార్యక్రమాల్లో భాగంగా విద్యార్థులు, యువతకు మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించే కార్యక్రమాన్ని (Peddapalli Drug Awareness) నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా,పెద్దపల్లి డీసీపీ భూక్య రామ్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా మాట్లాడుతూ…, పోలీస్ శాఖ సూచనలు, విజ్ఞప్తులను శ్రద్ధగా ఆలకించేందుకు కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికీ ముందుగా ధన్యవాదాలు తెలిపారు. ప్రిన్సిపాల్ తమ వ్యక్తిగత జీవిత అనుభవాలను ఉదాహరణలుగా వివరిస్తూ విద్యార్థులకు మంచి మార్గదర్శకత్వం అందించడం అభినందనీయమని అన్నారు. సమాజంలో ఉన్నత స్థానాల్లో ఉన్నవారు, సమాజంపై ప్రభావం చూపగలిగిన వ్యక్తులు ఇతరులకు ఆదర్శంగా నిలవాలని అన్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, ప్రజాప్రతినిధులు, ఇతర ప్రముఖులు విద్యార్థులకు రోల్ మోడల్స్‌గా నిలిచి వారిని సరైన మార్గంలో నడిపించాలని సూచించారు.ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతతో ముందుకు వస్తే పెద్దపల్లి జిల్లాను డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దడం సాధ్యమేనని తనకు పూర్తి నమ్మకం ఉందన్నారు.
మాదకద్రవ్యాల నియంత్రణ కోసం డీసీపీలు,ఏసీపీలు, సీఐలు, ఎస్హెచ్ఓలు, ఎస్ఐలు,ఇతర పోలీసు సిబ్బంది నిరంతరం కష్టపడి పనిచేస్తున్నారని పోలీస్ కమిషనర్ తెలిపారు. ముఖ్యంగా పెద్దపల్లి రైల్వే స్టేషన్‌పై ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు. మహారాష్ట్ర ప్రాంతం నుంచి కొందరు వ్యక్తులు రైల్వే స్టేషన్ ద్వారా వచ్చి యువతను లక్ష్యంగా చేసుకుని మత్తు పదార్థాల వినియోగం వైపు ప్రలోభపెడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. అమాయకులైన కొంతమంది యువకులను లక్ష్యంగా చేసుకుంటున్నారని, అందువల్ల ఈ విషయంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. తమ పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరితో కలిసి ఉంటున్నారు, వారి స్నేహితులు ఎవరు, వారి ప్రవర్తనలో ఏమైనా మార్పులు వస్తున్నాయా? అనే విషయాలను తల్లిదండ్రులు నిరంతరం గమనించాలని సూచించారు. పిల్లలు కోపగించుకున్నా సరే, వారి భవిష్యత్తు దృష్ట్యా వారిని ప్రశ్నించాలని అన్నారు. తల్లిదండ్రుల పర్యవేక్షణ, ప్రేమతో కూడిన మందలింపు పిల్లలను చెడు అలవాట్లకు దూరంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు.
విద్యాసంస్థల్లో ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రుల భాగస్వామ్యంతో ప్రహరీ కమిటీలను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు.ఈ కమిటీల ద్వారా పాఠశాలలు, కళాశాలల్లో మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై నిరంతరం అవగాహన కల్పించడంతో పాటు విద్యార్థుల ప్రవర్తనను గమనిస్తూ ఈ సమస్యను సమిష్టిగా నియంత్రించాలని సూచించారు. డ్రగ్స్ నియంత్రణలో పోలీసులతో పాటు విద్యాసంస్థలు, తల్లిదండ్రులు, సమాజంలోని ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.ఇప్పటికే మత్తు పదార్థాలకు అలవాటు పడిన యువతను నేరస్థులుగా చూడకుండా, వారిని ఆ వ్యసనం నుంచి బయటపడేలా చేయడానికి కూడా మనమంతా కృషి చేయాలని సీపీ అన్నారు. వారు మారాలని, మంచి జీవితాన్ని గడపాలని ఆసక్తి చూపితే పోలీస్ శాఖ తరఫున అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు.
సింగరేణి మెడికల్ కాలేజీలో డీ-అడిక్షన్ కేంద్రం అందుబాటులో ఉందని, మత్తు పదార్థాలకు బానిసైన వారికి వైద్యుల పర్యవేక్షణలో వైద్య చికిత్స, కౌన్సెలింగ్ అందించి వ్యసనం నుంచి బయటపడేందుకు సహకరిస్తున్నారని తెలిపారు. ఇప్పటికే పలువురు ఈ కేంద్రం ద్వారా చికిత్స పొందుతూ వ్యసనాలకు దూరమై సమాజంలో మంచి జీవితాన్ని కొనసాగిస్తున్నారని చెప్పారు. కాబట్టి మత్తు పదార్థాలకు అలవాటు పడిన వారు స్వచ్ఛందంగా ముందుకు వస్తే వారికి అవసరమైన చికిత్స అందించేందుకు పోలీస్ శాఖ పూర్తి సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికీ పోలీస్ శాఖ తరఫున తమ విజ్ఞప్తి ఒక్కటేనని సీపీ అన్నారు. ఎవరూ మత్తు పదార్థాల జోలికి వెళ్లవద్దని సూచించారు. ఇప్పటికే అలవాటు పడిన వారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి చికిత్స పొందాలని కోరారు.
అదే సమయంలో మాదకద్రవ్యాల సరఫరా, విక్రయాలు, వినియోగాన్ని ప్రోత్సహించడం లేదా ఈ అక్రమ కార్యకలాపాల్లో భాగస్వాములు కావడం వంటి చర్యలకు పాల్పడితే చట్టప్రకారం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించకుండా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. యువత భవిష్యత్తును కాపాడటం మనందరి బాధ్యత అని అన్నారు. పోలీస్ శాఖకు ప్రజలు సహకరిస్తేనే డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని తెలిపారు.
రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి జిల్లాను డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతతో భాగస్వాములు కావాలని సీపీ అంబర్ కిషోర్ ఝా కోరారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి డీసీపీ భూక్య రామ్ రెడ్డి, పెద్దపల్లి ఏసీపీ జి. కృష్ణ,పెద్దపల్లి సీఐ ప్రవీణ్ కుమార్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్,మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ రమేష్ బాబు,ఎస్ఐ రాజశేఖర్,రూరల్ ఎస్ఐ మధుకర్, శ్వేత తదితరులు పాల్గొన్నారు.

