కలం, భైంసా: సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ (Pawar Ramarao Patil) అన్నారు. గురువారం భైంసా పట్టణంలోని ఎస్‌ఎస్ జిన్నింగ్ ఇండస్ట్రీలో అనసూయ పవార్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతిభావంతులైన విద్యార్థులు, ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించారు. ఈ సందర్భంగా 30 మంది ఎంబీబీఎస్ సీట్లు సాధించిన విద్యార్థులు, ఆరుగురు ఎన్‌ఐటీ, ఐఐటీల్లో ప్రవేశం పొందిన విద్యార్థులతో పాటు 200 మంది ఉత్తమ ఉపాధ్యాయులను సత్కరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజకవర్గానికి చెందిన విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఎంబీబీఎస్ సీట్లు సాధించడంతో పాటు ఎన్‌ఐటీ, ఐఐటీల్లో రాణించడం అభినందనీయమన్నారు. విద్యతోనే సర్వతోముఖాభివృద్ధి సాధ్యమని, విద్యార్థులు ఇష్టపడి చదివి లక్ష్యాలను చేరుకోవాలని సూచించారు. ప్రతిభావంతులను ప్రోత్సహించడంతో పాటు ఉపాధ్యాయులను గౌరవించే కార్యక్రమాలను ప్రతి సంవత్సరం అనసూయ పవార్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తామని తెలిపారు.

