కలం, వెబ్ డెస్క్ : ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కు రొటేటర్ కఫ్‌తో పాటు రెండు కండరాల్లో గాయం తీవ్రంగా ఉందనే ప్రకటన రావడం తీవ్ర కలకలం రేపుతోంది. ఆయన రెండు భుజాలను నిశితంగా పరీక్షించిన ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రి వైద్యులు ఈ ప్రకటన చేశారు. ఆయన తక్షణమే సర్జరీ చేయించుకోవాలని సూచించారు. అయితే అభిమానులకు షేక్ హ్యాండ్ ఇవ్వడం వల్లే పవన్ కళ్యాణ్ కు ఈ సమస్య వచ్చిందని అంచనాలు వస్తుండడం హాట్ టాపిక్ గా మారింది.
గతంలోనే తాను అనారోగ్య సమస్యతో బాధపడుతున్నానని పవన్ కళ్యాణ్ పలు సభల్లో తెలిపారు. అయితే అభిమానుల ప్రేమ ముందు ఇది పెద్ద సమస్య కాదని తెలిపారు. దీంతో అభిమానుల షేక్ హ్యాండ్ ఇవ్వడం వల్లే ఆయనకు ఈ సమస్య వచ్చిందనే అంచనాలకు పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు బలాన్ని చేకూరుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్‌కు వచ్చిన రోటేటర్ కఫ్ సమస్య, లక్షణాలపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశం అవుతోంది.
రోటేటర్ కఫ్ సమస్య, లక్షణాలు
భుజంలోని నాలుగు కండరాల సముహాన్ని రోటేటర్ కఫ్ అంటారు. ఇది చేయి పైకి ఎత్తడానికి, తిప్పేందుకు ఉపయోగపడుతుంది. దీర్ఘ కాలిక సమస్యతో దీని సమస్య తీవ్రతరం అవుతుంది. దీని సమస్య తీవ్రతరంగా ఉంటే భుజం మొద్దు బారుతుంది. రాత్రిపూట తీవ్రమైన నొప్పి ఉంటుంది. చేయి పైకి ఎత్తాలన్నా కష్టంగా మారుతుంది. ఇలాంటి సమస్యతో బాధపడుతున్న పవన్ కళ్యాణ్.. తాను ముందుగా నిర్ణయించిన పాలనపరమైన , అధికారిక కార్యక్రమాలు పూర్తి చేసిన తర్వాతే సర్జరీ చేయించుకుంటానని వెల్లడించారు.

