Mobile Popup Ad
Mobile Popup Ad

మెట్రో రైల్’కు రీఫైనాన్స్.. ఐఆర్ఎఫ్‌సీ నుంచి రూ. 13,527 కోట్లు శాంక్షన్

కలం, తెలంగాణ బ్యూరో : ఎల్ అండ్ టీ కంపెనీ నుంచి హైదరాబాద్ మెట్రో రైల్ ఫస్ట్ ఫేజ్‌ను స్వాధీనం చేసుకున్న రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక కష్టాలు తీరాయి. మెట్రో రైల్ సేవలు ప్రభుత్వ పరిధిలోకి రావడంతో ఎల్ అండ్ టీ కంపెనీకి రూ. 13 వేల కోట్లకు పైగా ప్రభుత్వం పేమెంట్ చేయాల్సి ఉన్నది. ఇప్పటికే సంక్షేమ పథకాలు, గత ప్రభుత్వ అప్పులను తీర్చడం, ఉద్యోగులకు డీఏలు, పీఆర్సీ ఇబ్బందులు ఉన్న సమయంలో ఎల్ అండ్ టీ కంపెనీకి రూ. 13 వేల కోట్ల మేర అప్పులను తీర్చడం ఆర్థికంగా చిక్కులు తెచ్చినట్లయింది. సరిగ్గా ఈ సమయంలో ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి రీఫైనాన్సింగ్ రూపంలో రూ. 13,527 కోట్ల మేర రుణం సమకూరింది. ఇరవై ఏండ్లలో ప్రతీ క్వార్టర్‌కు ప్రిన్సిపల్ అమౌంట్‌లో కొంత, వడ్డీ రూపంలో మరికొంత చొప్పున చెల్లించేలా త్రైపాక్షిక ఒప్పందం కుదిరింది. రాష్ట్ర ప్రభుత్వం, హైదరాబాద్ మెట్రో రైల్ కార్పొరేషన్, ఐఆర్ఎఫ్‌సీ మధ్య కుదిరిన ఈ అవగాహనా ఒప్పందంపై ఢిల్లీలో సోమవారం సంతకాలు జరిగాయి. ఈ ఆర్థిక సహాయంతో హైదరాబాద్ మెట్రో రైల్‌కు ఆర్థికంగా ఊతం లభించినట్లయింది. హైదరాబాద్ నగర రవాణా మౌలిక సదుపాయాలను బలోపేతం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వానికి అవకాశం దొరికింది. ఐఆర్ఎఫ్‌సీ సీఎండీ (సీఈఓ కూడా) మనోజ్ కుమార్ దూబే, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు సమక్షంలో సోమవారం ఈ ఒప్పందం కుదిరింది.
హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ శివేంద్ర ప్రతాప్, తెలంగాణ ప్రత్యేక కార్యదర్శి అద్వైత్ కుమార్ సింగ్, ఎల్ అండ్ టీ మెట్రో రైల్ లిమిటెడ్ ప్రతినిధి కేవీబీ రెడ్డి, సీఎఫ్ఓ ఏవీఆర్ శ్రీనివాస శర్మ, ఐఆర్ఎఫ్‌సీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>