Mobile Popup Ad
Mobile Popup Ad

జులై 3 నాటికి గ్రీనింగ్ సొసైటీ ఏర్పాటు చేయాలి: పవన్ కల్యాణ్

కలం, వెబ్ డెస్క్: ఏపీలో కూటమి ప్రభుత్వం ప్రతిపాదించిన ‘గ్రీనింగ్ సొసైటీ’ ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఆదేశించారు. జులై 3వ తేదీ నాటికి ఈ సొసైటీ ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియ పూర్తి కావాలన్నారు. గ్రీనింగ్ సొసైటీకి సంబంధించిన నిబంధనలు, నియామకాలు, విధివిధానాల ప్రతిపాదనలన్నీ కచ్చితంగా ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 2025కి అనుగుణంగానే ఉండేలా చూసుకోవాలని చెప్పారు. ఈ ప్రాజెక్టు అత్యంత ప్రాధాన్యత కలిగినది కావడంతో, ఎలాంటి కాలయాపన చేయకుండా సొసైటీ త్వరగా కార్యరూపం దాల్చేలా తక్షణ చర్యలు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు. గురువారం వెలగపూడి సచివాలయంలో అటవీశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి మాట్లాడారు.

రాష్ట్రంలోని ప్రతి గ్రామ పంచాయతీలోనూ ఒక నర్సరీ ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సూచించారు. ఎక్కడైనా పంచాయతీలో ఏర్పాటు సాధ్యం కాకపోతే, కనీసం మూడు, నాలుగు పంచాయతీలను ఒక క్లస్టర్‌గా చేసి, ఉమ్మడిగా ఒక నర్సరీ ఉండేలా వెంటనే పనులు ప్రారంభించాలని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ‘వీబీ-జీ రామ్ జీ’ పథకం కిందకు నర్సరీల పెంపకాన్ని కూడా అనుసంధానించామన్నారు. ఈ పథకం ద్వారా లభించే నిధులు, ఉపాధి దినాలను సమర్థంగా ఉపయోగించుకుని, గ్రామీణ ప్రాంతాల్లో నర్సరీలను పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలని చెప్పారు.

పర్యావరణ రక్షణలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా చల్లడానికి 2.6 కోట్ల సీడ్ బాల్స్ సిద్ధం చేసినట్లు డిప్యూటీ సీఎంకు అధికారులు తెలిపారు. ఈ వర్షాకాలంలోనే వీటిని అటవీ, ఖాళీ ప్రాంతాలలో వెదజల్లేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు వెల్లడించారు. కొండ కోనల్లో విత్తనాలను చల్లడానికి ఈసారి సుమారు 40 నుంచి 50 అత్యాధునిక డ్రోన్లను ఉపయోగిస్తున్నట్లు వివరించారు. ఈ ప్రణాళికపై సీడ్ బాల్స్ వెదజల్లే కార్యక్రమాన్ని కేవలం ప్రభుత్వ ఉద్యోగులకే పరిమితం చేయకుండా, సమాజంలోని అన్ని వర్గాల ప్రజలను భాగస్వామ్యం చేయాలన్నారు. విద్యార్థులు, యువత, స్వచ్ఛంద సంస్థలు, స్థానిక ప్రజలను కలుపుకొని దీనిని ఒక ప్రజా ఉద్యమంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పారు.

Read Also: ఏపీ స్కూల్స్ అప్‌గ్రేడ్.. మంత్రి లోకేశ్ కీలక ఆదేశాలు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>