కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్‌లో విద్యా రంగ అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ క్రమంలో రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) ఉండవల్లి నివాసంలో విద్యాశాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎంశ్రీ పథకం (PM-SHRI Scheme) నిధుల వినియోగంలో ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలిపిన అధికారులను మంత్రి అభినందించారు. ప్రభుత్వ పాఠశాలల ఆధునీకరణలో రాష్ట్రం సాధించిన పురోగతిని ఆయన ప్రశంసించారు.
ఇక, విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కీలక ఆదేశాలు జారీ చేశారు. కడప మోడల్‌ను అనుసరించి ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 844 స్మార్ట్ కిచెన్ల నిర్మాణానికి అవసరమైన చర్యలు వెంటనే చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అదే విధంగా, రాష్ట్రంలోని 430 కేజీబీవీలలో చదువుతున్న 1,06,360 మంది విద్యార్థినుల కోసం 53,180 బంక్ బెడ్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి (Nara Lokesh) స్పష్టం చేశారు. విద్యార్థుల సంక్షేమం, పాఠశాలల మౌలిక వసతుల మెరుగుదలే ప్రభుత్వ లక్ష్యమని, అందుకు తగిన చర్యలు నిరంతరం కొనసాగుతాయని మంత్రి తెలిపారు.
Read Also: జులై 3 నాటికి గ్రీనింగ్ సొసైటీ ఏర్పాటు చేయాలి: పవన్ కల్యాణ్
Follow Us On: Sharechat

