కలం, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తాము ఎన్నడూ అడ్డుపడలేదని.. కాంగ్రెస్ విభజించిన తీరునే తప్పుపట్టామని ఢిల్లీ వేదికగా జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) స్పష్టం చేశారు. 2009 నుంచే ఇదే విషయాన్ని నేను రిపీటెడ్‌గా చెప్తున్నానని.. ఇది తన కమిట్‌మెంట్, జనసేన పార్టీ కమిట్‌మెంట్ అని వ్యాఖ్యానించారు. నాటి నుంచి నేటి వరకు కాంగ్రెస్ ధోరణి మారలేదని.. తెలంగాణలో జనసేన సభను అడ్డుకోవడమే దీనికి నిదర్శనని ఆగ్రహం వ్యక్తం చేశారు. జాతీయ విస్తరణ దిశగా కీలక అడుగులేస్తున్న జనసేన పార్టీ.. సోమవారం ఢిల్లీలో “జాతీయ సమగ్రత కోసం సేన ప్రస్థానం” పేరిట సమావేశం (Jana Sena Delhi Meeting) ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి పార్టీ కీలక నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా నాయకులకు పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ దిశానిర్దేశం చేశారు. ఢిల్లీ మెడలు వంచుతాం, చొక్కాపట్టుకుని కిందకు దించుతామని చాలామంది దక్షిణాది నేతలు మాట్లాడుతున్నాని.. వాళ్లు ఢిల్లీకి రాగానే ఎవ్వరి నోర్లు పెగలవు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఎల్లప్పుడూ దేశానికి మాత్రమే ప్రాధాన్యత..
2014లో జనసేన పార్టీ ప్రస్థానం ప్రారంభించినప్పుడు అధికారం, పదవులు అనే ఆలోచన లేదని పవన్ కళ్యాణ్ ఆనాటి రోజులను గుర్తు చేశారు. దేశానికి ఏం చేయాలి.. దేశ సమైక్యతను, సమగ్రతను ఎలా కాపాడాలనే ఆలోచనతోనే జనసేన ప్రస్థానం మొదలయ్యిందన్నారు. పార్టీ సిద్ధాంతాలు, భావజాలం బలపడుతున్నాయని.. ఇతర రాష్ట్రాల నుంచి పార్టీ కోసం పని చేయడానికి చాలా మంది ముందుకు వస్తున్నారని తెలిపారు. ఇది జనసేన భావ జాలం బలంగా ముందుకి వెళ్తుందనడానికి సంకేతమని చెప్పారు. జనసేన పార్టీ ఎల్లప్పుడూ దేశానికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టం చేశారు.
ఢిల్లీ మీటింగ్‌కు కారణమిదే..
ఢిల్లీలోనే సమావేశం పెట్టడానికి కారణం ఢిల్లీ చరిత్ర గొప్పదనం అని పవన్ కొనియాడారు. ఈ నేల త్యాగాలకు ప్రతీక, పాలనకు ప్రతిరూపమన్నారు. రాజ్యాంగ విలువలకు ప్రతిబింబమని.. ఎన్నో చారిత్రక ఘట్టాలకు సాక్ష్యమని చెప్పారు. ఇలాంటి గొప్ప నేలలో దేశ సమగ్రత కోసం పెట్టిన సమావేశం ద్వారా జనసేన పార్టీ దేశ భక్తికి ఎంత విలువ ఇస్తుందన్నది చెప్పాలన్నదే తమ ఉద్దేశమని అన్నారు. చలి చీమలు కూడా పాముని చంపేస్తాయన్నట్టు.. చెడు అయినా మంచి అయినా దేశానికి, జాతి సమగ్రతకు ద్రోహం చేసే ఎవరిని అయినా జనసేన వ్యతిరేకిస్తుందని వ్యాఖ్యానించారు. విభజన వాదాన్ని ప్రోత్సహించే వారిని జనసేన పార్టీ ఉపేక్షించదని.. అలాంటి వారిపై జనసేన గళం బలంగా ఉంటుందన్నారు. ఢిల్లీకి జనసేన పార్టీ ఎప్పుడూ అధికారం కోసం, పదవుల కోసం, ప్రాపకాల కోసం ఉపయోగించుకోదని అన్నారు. దేశ భక్తి, దేశ సమగ్రత, సమైక్యత కోసం మాత్రమే దేశ రాజధాని బాట పడతామని వివరించారు. పార్టీ ఎంపీలు కూడా దేశంలోని కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అన్ని సమస్యల మీద మాట్లాడాలని సూచించారు.

